postal ballet: పోస్టల్‌ బ్యాలెట్‌పై ఆసక్తి చూపని తెలంగాణ ఉద్యోగులు

  • రంగారెడ్డి జిల్లాలో మూడో వంతు కూడా వినియోగించని వైనం
  • మేడ్చల్‌ జిల్లాలోనూ ఇదే పరిస్థితి
  • బ్యాలెట్‌ తీసుకున్నా తిరిగి పంపని చాలామంది

విలువైన ఓటు సద్వినియోగం చేసుకునే విషయంలో ఉద్యోగులు కూడా వెనుకబడి ఉన్నారా? అంటే అవుననే అనిపిస్తోంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు ప్రభుత్వం కల్పించే పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయాన్ని కనీసం మూడో వంతు మంది కూడా వినియోగించుకోక పోవడం గమనార్హం. ఉదాహరణకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లాలో దాదాపు 35 వేల మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. వీరంతా పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకోవచ్చు.

కానీ కేవలం 9,671 మంది మాత్రమే పోస్టల్‌ బ్యాలెట్‌ను తీసుకున్నారు. కనీసం వీరైనా తిరిగి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి బ్యాలెట్‌లు పంపారా అంటే కేవలం 6,971 మంది మాత్రమే సద్వినియోగం చేసుకున్నారు. అంటే కేవలం 20 శాతం మంది మాత్రమే ఓటుహక్కు వినియోగించుకున్నట్లు. వేసిన ఓట్లలోనూ 494 చెల్లలేదు. అంటే సద్వినియోగం అయిన ఓట్లు 6,477 మాత్రమే.

అయితే, అందని బ్యాలెట్లపై అధికారులు మరో కారణం చెబుతున్నారు. పోస్టల్‌ బ్యాలెట్లు తీసుకున్న వారు సాధారణంగా సద్వినియోగం చేసుకునే అవకాశం ఉందని, ఈసారి ఓట్ల లెక్కింపు సమయానికి వరుస సెలవులు రావడం వల్ల సకాలంలో అందకపోయి ఉండవచ్చునని ఒక అధికారి చెప్పారు. ఓట్ల లెక్కింపు రోజు నాటికి అందిన ఓట్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఆ తర్వాత అందితే చెల్లవు. ఈసారి ఎన్నికల కౌంటింగ్‌ మంగళవారం జరిగింది. కౌంటింగ్‌ ముందు రెండో శనివారం, ఆదివారం సెలవులు రావడంతో ఇవి కౌంటింగ్‌ రోజుకు అందకపోయి ఉండొచ్చని ఒక అధికారి వివరణ ఇచ్చారు.

2014లో జరిగిన ఎన్నికల్లోనూ రంగారెడ్డి జిల్లాలో ఇదే పరిస్థితి ఉంది. అప్పట్లో దాదాపు 24 వేల మంది పోస్టల్‌ బ్యాలెట్లు వినియోగించుకోవాల్సి ఉండగా కేవలం 9 వేల ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఇందులో మూడో వంతుకంటే అధికంగా అంటే 3,400 ఓట్లు చెల్లలేదు. మేడ్చల్‌ జిల్లాలోనూ పరిస్థితి సేమ్‌ టు సేమ్‌. జిల్లాలో కూడా దాదాపు 22 వేల మంది ఈనెల 7వ తేదీన జరిగిన ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. కేవలం 2,702 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సంఖ్య పది శాతానికి అటూ ఇటుగా ఉంది.

More Telugu News