Rajasthan: సీనియర్లకు పట్టం కట్టిన కాంగ్రెస్.. రాజస్తాన్ ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లాట్ నియామకం!

  • మధ్యప్రదేశ్ సీఎంగా కమల్ నాథ్
  • ఛత్తీస్ గఢ్ అభ్యర్థిపై త్వరలో నిర్ణయం
  • సోనియా సూచనతో మనసు మార్చుకున్న రాహుల్

రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని కాంగ్రెస్ పార్టీ మట్టికరిపించిన సంగతి తెలిసిందే. మొత్తం 199 స్థానాలున్న అసెంబ్లీలో కాంగ్రెస్ 100 స్థానాల్లో గెలుపొంది అగ్రస్థానంలో నిలవగా, అధికార బీజేపీ 73 సీట్లతో పరాజయం పాలయింది. ఈ ఎన్నికల్లో ఇతరులు 26 స్థానాల్లో విజయం సాధించారు. అయితే కాంగ్రెస్ సొంతంగా మెజారిటీ సాధించిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఎవరిని ఎన్నుకుంటారన్న విషయంలో క్లారిటీ వచ్చేసింది. రాజస్తాన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ ను నియమిస్తున్నట్లు కాంగ్రెస్ ఈ రోజు ప్రకటించింది. సీఎం పదవిపై గంపెడాశలు పెట్టుకున్న యువనేత సచిన్ పైలెట్ కు డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టింది.

సీనియర్లను పక్కనపెట్టి యువ నేతలకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఈసారి భావించారు. అయితే 2019 లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులను ఎన్నికల పోరుకు సిద్ధం చేసేందుకు సీనియర్ల అనుభవం పనికివస్తుందని యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ రాహుల్ కు సూచించారు. నిధుల సమీకరణ, ఎన్నికల ప్రచారంలో ప్రజల్లోకి దూసుకుపోవడం కోసం సీనియర్ల సహకారం అవసరమని నచ్చజెప్పారు. దీంతో వెనక్కి తగ్గిన రాహుల్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ ను రాజస్తాన్ సీఎం పదవికి, కమల్ నాథ్ ను మధ్యప్రదేశ్ సీఎం పదవికి ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఛత్తీస్ గఢ్ కు కాబోయే ముఖ్యమంత్రిని పార్టీ శ్రేణులతో చర్చించి నిర్ణయించనున్నారు.

More Telugu News