Khammam District: ఖమ్మం జిల్లా ప్రజలు భిన్నమైన తీర్పు ఇచ్చి అధికార పార్టీ దుమ్ము దులిపారు: టీడీపీ

  • అన్ని జల్లాల్లోనూ ఈ తీర్పువచ్చి ఉంటే టీఆర్‌ఎస్‌కు షాక్‌ తగిలేది
  • టీడీపీ ఓటమికి పార్టీలో సమన్వయలోపం కొంత కారణం
  • ప్రజా తీర్పును శిరసావహిస్తాం

ఖమ్మం ప్రజలు భిన్నమైన తీర్పు ఇచ్చి అధికార పార్టీ దుమ్ము దులిపారని, తమ రాజకీయ చైతన్యాన్ని నిరూపించుకున్నారని, అన్ని జిల్లాల్లో ఇటువంటి భిన్నమైన తీర్పువచ్చి ఉంటే టీఆర్‌ఎస్‌కు షాక్‌ తగిలేదని టీడీపీ నాయకులు అభిప్రాయపడ్డారు. జిల్లాలో మహాకూటమితో పాటు టీడీపీ మంచి ఫలితాలు సాధించిన విషయం గుర్తు చేశారు. బలం ఉన్నా సమన్వయ లోపం కారణంగానే ఖమ్మం నియోజకవర్గంలో ఓటమి పాలయ్యామన్నారు. ఖమ్మం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో టీడీపీ జిల్లా అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్య, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మద్దినేని స్వర్ణకుమారి విలేకరులతో మాట్లాడారు.

గడచిన నాలుగున్నరేళ్ల పాలనలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని, మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ఒక్కటీ అమలు చేయలేదని చెప్పారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగానే ఖమ్మం ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని చెప్పారు. ఈసారి కూడా అమలుకాని వాగ్దానాలు చేసి టీఆర్‌ఎస్‌ ప్రజల్ని మభ్యపెట్టి మళ్లీ అధికారంలోకి వచ్చిందన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చేలా తాము పోరాడుతామని తెలిపారు.

More Telugu News