sanjay: రైతు కడుపుమంట పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రధాని కార్యాలయం.. మండిపడుతున్న నెటిజన్లు

  • 750 కేజీల ఉల్లికి రూ. 1,064 మాత్రమే వచ్చిన వైనం
  • ఒళ్లు మండి ప్రధాని సహాయనిధికి మనీఆర్డర్ చేసిన రైతు
  • డబ్బు రూపంలో స్వీకరించలేం.. ఆన్ లైన్ లో పంపండి అంటూ పీఎంఓ లేఖ

కడుపుమండిన రైతు పట్ల ప్రధాని మోదీ కార్యాలయం స్పందించిన తీరు చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే, సంజయ్ అనే రైతు అష్టకష్టాలు పడి 750 కేజీల ఉల్లిని విక్రయించగా... దళారుల దెబ్బకు కేవలం రూ. 1,064 మాత్రమే వచ్చాయి. దీంతో ఒళ్లు మండిపోయిన ఆయన ఆ మొత్తాన్ని ప్రధాని సహాయ నిధికి మనీఆర్డర్ ద్వారా పంపారు.

అయితే, ఆయనకు దిమ్మ తిరిగే షాక్ ను ప్రధాని కార్యాలయం ఇచ్చింది. నగదు రూపంలో తాము విరాళాలను స్వీకరించడం లేదని... ఈ మొత్తాన్ని ఆన్ లైన్ ద్వారా పంపాలంటూ ఆయనకు ఒక లేఖ రాశారు. ఈ విషయం కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది. రైతుకు పరిహారం ఇవ్వాల్సింది పోయి, ఇంత నిర్లక్ష్యంగా, వెటకారంగా ప్రవర్తిస్తారా? అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు సంజయ్ ను గతంలో మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సత్కరించాయి. వ్యవసాయంలో విప్లవాత్మక పద్ధతులను పాటించినందుకు అభినందించాయి. 2010లో భారత పర్యటనకు అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా వచ్చినప్పుడు... ఆయనను కలిసే అవకాశం కూడా సంజయ్ కు వచ్చింది. అలాంటి వ్యక్తికి ఇప్పుడు ఇలాంటి చేదు అనుభవం ఎదురయిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

More Telugu News