Vijay mallya: గతంలో కసబ్.. ఇప్పుడు మాల్యా.. ఇద్దరికీ ఆర్ధర్ రోడ్డు జైలే!

  • సకల సౌకర్యాలున్న జైలుగా ఆర్థర్ రోడ్డుకు గుర్తింపు
  • బోల్డంత గాలి, వెలుతురు
  • అత్యంత కట్టుదిట్టమైన భద్రత

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించాలంటూ లండన్ కోర్టు సోమవారం తీర్పు చెప్పింది. అయితే, తీర్పును పై కోర్టులో అప్పీలు చేసుకునేందుకు మాల్యాకు 14 రోజుల గడువు ఇచ్చింది. అక్కడ కూడా మాల్యాకు చుక్కెదురైతే భారత్‌కు రావడం తప్ప మరోమార్గం లేదు.

ఇక మాల్యా భారత్‌కు రావడం దాదాపు ఖాయమని తేలిపోవడంతో ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలును సిద్ధం చేస్తున్నారు. హై ప్రొఫైల్ ఖైదీలను ఉంచేందుకు ఉద్దేశించే ఈ జైలులో అత్యంత కట్టుదిట్టమైన భద్రతతోపాటు ఖైదీలకు ప్రత్యేక సౌకర్యాలు కూడా ఉంటాయి. ముంబైలో మారణకాండ సృష్టించిన ఉగ్రవాదుల్లో ఒకడైన అజ్మల్ కసబ్‌ను ఉరితీసే వరకు ఇదే జైలులో ఉంచారు.

ఇక్కడ బెడ్, టీవీ, వెస్ట్రన్ టాయిలెట్‌తో కూడిన విశాలమైన గదిని మాల్యాకు కేటాయించనున్నారు. మాల్యాను ఉంచనున్న బ్యారక్ నంబరు 12 గది తలుపు తూర్పు వైపు ఉండడంతో కావాల్సినంత వెలుతురు, గాలి ఉంటాయి. సీసీ కెమెరాలు, అదనపు భద్రతా సిబ్బంది కూడా ఉంటారు. వాకింగ్ కోసం కొంత నడవ కూడా ఉంటుంది. నాలుగు సార్లు భోజనం చేయవచ్చు. సెల్‌కు దగ్గరల్లోనే ఆసుపత్రి కూడా ఉంది.

ఇలా దేశంలోనే సకల సౌకర్యాలు ఉన్న జైలుగా ఆర్థర్ రోడ్డు జైలుకు గుర్తింపు ఉంది. భారత బ్యాంకులకు రూ. 9 వేల కోట్ల రుణాలను ఎగ్గొట్టిన మాల్యా దేశం విడిచి పారిపోయి లండన్‌లో ఉంటున్నారు. ఆయనను భారత్ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేసింది. చివరికి విజయం సాధించింది. లండన్ కోర్టు తీర్పుపై మాల్యా అప్పీలుకు వెళ్లినా ఫలితం ఉండకపోవచ్చని భారత ప్రభుత్వం పూర్తి విశ్వాసంతో ఉంది.

More Telugu News