Telangana: హైదరాబాద్‌లో బద్ధకించిన ఓటర్లు.. ‘టాప్’ లేపిన మధిర ఓటర్లు!

  • ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు
  • రాష్ట్రవ్యాప్తంగా 69.1 శాతం పోలింగ్
  •  మలక్‌పేటలో అత్యల్పంగా 40 శాతం
తెలంగాణ శాసనసభకు శుక్రవారం జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని, ఒక్క కేంద్రంలోనూ రీపోలింగ్ నిర్వహించే పరిస్థితి తలెత్తలేదని ఎన్నికల సంఘం పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా 69.1 శాతం పోలింగ్ నమోదైనట్టు తెలిపింది. ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గంలో అత్యధికంగా 91.27 శాతం ఓటింగ్ నమోదు కాగా, హైదరాబాద్‌లోని మలక్‌పేటలో అత్యల్పంగా 40 శాతం మాత్రమే నమోదైనట్టు తెలిపింది.

కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంల మొరాయింపు, కల్వకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డిపై దాడి వంటి ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలో పెరుమాండ్ల స్వామి అనే వ్యక్తి గుండెపోటుతో పోలింగ్ కేంద్రంలోనే మృతి చెందాడు. కాగా, రాష్ట్రంలోని 13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది.  

ఇక, నియోజకవర్గాల వారీగా జరిగిన పోలింగ్‌ను తీసుకుంటే.. మధిరలో 91.27 శాతం ఓటింగ్ నమోదు కాగా, యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడులో 90.88 శాతం పోలింగ్‌ నమోదయింది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి 73 నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పెరగ్గా, 46 నియోజకవర్గాల్లో తగ్గింది. మలక్‌పేటలో అత్యల్పంగా 40 శాతం మాత్రమే పోలింగ్ నమోదు కావడం గమనార్హం. ఎల్బీనగర్‌లో 42 శాతం నమోదైంది. గతంతో పోలిస్తే హైదరాబాద్‌లో 5.26 శాతం పోలింగ్ తగ్గడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. గత ఎన్నికల్లో 49.86 శాతం పోలింగ్ నమోదు కాగా, ఈసారి అది 43.36 శాతానికి పడిపోయింది. నిజానికి ఈసారి ఎన్నికల్లో పోలింగ్ శాతం భారీగా పెరుగుతుందని, 73 నుంచి 75 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. అయితే, వారి అంచనాలను తలకిందులు చేస్తూ  69.1 శాతం  పోలింగ్ నమోదైంది.
Telangana
Hyderabad
Khammam District
Madhira
voting
Elections

More Telugu News