Telangana: మొరాయించిన వందల కొద్దీ ఈవీఎంలు... వెనుదిరుగుతున్న ఓటర్లు!

  • 229 కేంద్రాల్లో ఈవీఎం సమస్యలు
  • ఇళ్లకు వెళ్లిపోతున్న ఓటర్లు
  • ఈసీపై వెల్లువెత్తుతున్న విమర్శలు

తెలంగాణ ఎన్నికలకు ఏర్పాట్లను ఈసీ సరిగ్గా చేయలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల ఈవీఎంలు పనిచేయడం లేదు. 229 పోలింగ్ కేంద్రాల్లో ఇంకా పోలింగ్ ప్రారంభం కాలేదు. ఈ పోలింగ్ కేంద్రాలకు ఉదయం 7 గంటల్లోపే చేరుకున్న ఓటర్లు... ఆపై ఇళ్లకు వెళ్లిపోతున్నారు. హైదరాబాద్ పరిధిలోని 20 బూత్ లలో ఇంకా పోలింగ్ ప్రారంభం కాలేదు. దీంతో అక్కడికి వచ్చిన ఓటర్లు ఎన్నికల కమిషన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.

కాగా, ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన సీఈఓ రజత్ కుమార్, నిర్ణీత సమయానికే ఓటింగ్ ప్రారంభమైందని, ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరిగినట్టు ఫిర్యాదులు ఇప్పటివరకూ రాలేదని చెప్పారు. ఈవీఎంలు మొరాయించాయన్న ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించామని తెలిపారు. ఎక్కడా ఓటర్లు వెనుదిరిగినట్టు తన దృష్టికి రాలేదని అన్నారు. పోలింగ్ సమయాన్ని పెంచే ఆలోచనేదీ లేదని స్పష్టం చేశారు. ఎక్కడైనా అనివార్య పరిస్థితులు ఏర్పడి, అసలు పోలింగ్ జరుగకుంటే ఆ ప్రాంతాల్లో ఆదివారం నాడు పోలింగ్ ఉంటుందని అన్నారు.

More Telugu News