Lok Sabha: లోక్ సభ ఎన్నికల కోసం డిసెంబర్ 26 నుంచి ఓటరు జాబితా మళ్లీ సవరిస్తాం: రజత్ కుమార్

  • 2019 జనవరి 1కి 18 ఏళ్లు నిండే వారూ   దరఖాస్తు చేసుకోవచ్చు
  • రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం
  • పోలింగ్ ను పర్యవేక్షించేందుకు ప్రత్యేక సెల్

లోక్ సభ ఎన్నికల కోసం డిసెంబర్ 26 నుంచి మళ్లీ ఓటరు జాబితా సవరణ చేపడతామని తెలంగాణ ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్ వెల్లడించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, 2019 జనవరి 1కి 18 ఏళ్లు నిండే వారు కూడా తమ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.

ఈ సందర్భంగా రేపు తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సంబంధించి ఆయన మాట్లాడుతూ, రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని, ఐదు గంటల వరకు పోలింగ్ కేంద్రాన్ని చేరుకున్నవారికీ ఓటు వేసే హక్కు అవకాశం కల్పిస్తామని చెప్పారు. పోలింగ్ కేంద్రాలకు ఈరోజు రాత్రికి సిబ్బంది చేరుకుంటారని, పోలింగ్ ను పర్యవేక్షించేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామని, కొందరు ఫ్లోర్ మేనేజర్లుగా పనిచేస్తారని చెప్పారు.

ఓటింగ్ రోజునా సీ విజిల్ ద్వారా ఫిర్యాదులు చేయొచ్చు

ఈవీఎం, వీవీ ప్యాట్ లు అన్నీ సిద్ధంగా ఉన్నాయని, 240 మంది బెల్ ఇంజనీర్లు రేపు అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉంటారని, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎన్నికలు పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తామని రజత్ కుమార్ చెప్పారు. ఓటింగ్ రోజు కూడా సీ విజిల్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చని ఓటర్లకు సూచించారు.

ప్రతి సెక్టార్ మేజిస్ట్రేట్ వద్ద అదనంగా 2 ఈవీఎంలు, వీవీ ప్యాట్ యంత్రాలు ఉంచుతున్నామని అన్నారు. ఇప్పటి వరకు రూ.135 కోట్ల సొమ్మును స్వాధీనం చేసుకున్నామని, ఆయా చోట్ల డబ్బు పంపిణీ చేస్తున్నారని పలు పార్టీలు తమ దృష్టికి తీసుకొస్తున్నట్లు చెప్పారు.

More Telugu News