Andhra Pradesh: కేసీఆర్, నోరు అదుపు పెట్టుకో.. లేదంటే ముక్కు కోసి చేతిలో పెడతా!: బైరెడ్డి రాజశేఖరరెడ్డి వార్నింగ్

  • కేసీఆర్ అభ్యంతరకర భాషను వాడారు
  • ఆయన దూషణలను వెనక్కి తీసుకోవాలి
  • కర్ణాటకవాళ్లు తంతారని మాపై పడి ఏడుస్తున్నారు

ఆర్డీఎస్ ను అడ్డుపెట్టుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యంతరకరమైన భాషను వాడుతున్నారని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి విమర్శించారు. ఆలంపూర్ సభలో ‘ఒరే బైరెడ్డి కొడకా’ అంటూ చెప్పిన మాటను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలను కేసీఆర్ రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో తనకు ఎంతోమంది బంధువులు, స్నేహితులు ఉన్నారని వ్యాఖ్యానించారు. రాజకీయ అవసరాల కోసం ఇరురాష్ట్రాల మధ్య తెలంగాణ సీఎం తగాదాలు పెడుతున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ నోటిని అదుపులో పెట్టుకోవాలనీ, లేదంటే ముక్కు కోసి చేతిలో పెడతానని వార్నింగ్ ఇచ్చారు.

కర్నూలులో బైరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లాలో నా బంధువులు, స్నేహితులు, సన్నిహితులు ఎందరో ఉన్నారు. వారితో మంచిగానే ఉంటున్నాం. ఈ రోజు ఓట్ల కోసం తగాదాలు పెట్టకు. రాయలసీమ రైతుల పొట్ట కొట్టవద్దు. నీకు శ్రీశైలం, ఆర్డీఎస్‌ అంటే అసలు తెలుసా? శ్రీశైలం ముంపు కింద మహబూబ్‌నగర్‌, కర్నూలు జిల్లాల రైతులు తీవ్రంగా నష్టపోయారు. రెండు జిల్లాల్లో నష్టపోయిన వారికి నందికొట్కూరులో సభ ఏర్పాటు చేసి ప్రధానమంత్రి సమక్షంలో చెక్‌లు ఇప్పించాను.

కర్ణాటకలోని మాన్విలో జలదోపిడీ జరుగుతుంటే మాపై పడి ఏడుపు ఎందుకు? వాళ్లు తంతారని భయపడి మాపై నీచమైన వ్యాఖ్యలు చేయకు. ఎన్నికల్లో ఎలాగూ నీకు ఓటమి తప్పదు. అప్పుడు బహిరంగ చర్చకు రా.. నా ప్రాంత రైతులతో నేనూ వస్తా. ఆర్డీఎస్‌ విషయంలో ఎక్కడ అన్యాయం జరుగుతోందో తేల్చుకుందాం’ అని అన్నారు. కేసీఆర్ తరహాలో కొడకా.. అంటూ తాను దిగజారి వ్యాఖ్యలు చేయబోనని స్పష్టం చేశారు.

More Telugu News