KCR: మొన్న ఒకడు ఇక్కడికొచ్చి మీ ఊరికి అల్లుడినన్నాడు: కేసీఆర్ పై రేవంత్ రెడ్డి సెటైర్

  • మొన్నొకడు వచ్చాడు.. గతంలో ఎప్పుడైనా వచ్చాడా?
  • గల్లీ నుంచి ఢిల్లీ వరకు కొడంగల్ పేరును వినిపించా
  • ప్రజాఫ్రంట్ ప్రభుత్వంలో నాది ముఖ్యమైన పాత్ర

కొడంగల్ నియోజకవర్గంలోని బొమ్రాస్‌పేట, దౌల్తాబాద్, మద్దూరు, కోస్గి మండలాల్లో బుధవారం రోడ్ షో నిర్వహించిన కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై విరుచుకుపడ్డాడు. మొన్నొకడు ఇక్కడికి వచ్చి తాను మీ ఊరికి అల్లుడినని చెప్పాడని, అంతకుముందెప్పుడైనా వచ్చి మీ కష్టాల గురించి అడిగాడా? అని ప్రశ్నించారు. ఇక్కడి ప్రజల ఆదరాభిమానాలతోనే ఇంతటి వాడినయ్యానని, తనను భుజాలపై మోశారని అన్నారు.

గల్లీ నుంచి ఢిల్లీ వరకు కొడంగల్ పేరును వినిపించానని, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కోస్గి తీసుకొచ్చానని గుర్తు చేశారు. రాష్ట్రంలోని ఒక్కడి ఉద్యోగం పీకేస్తే లక్షలాదిమంది యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు.  గతంలో మహబూబ్‌నగర్ నుంచి గెలిచిన కేసీఆర్ ఐదేళ్లలో ఒక్కసారి కూడా కొడంగల్ గడ్డపై అడుగుపెట్టలేదని, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వచ్చారని నిలదీశారు.

కేసీఆర్ తనపై కక్షతో అణచివేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతల ఇళ్లపై జరుగుతున్న దాడులే అందుకు నిదర్శనమని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో రాబోయేది ఇందిరమ్మ రాజ్యమేనని స్పష్టం చేశారు. త్వరలో కొలువుదీరనున్న ప్రజాఫ్రంట్ ప్రభుత్వంలో తన పాత్ర తొలి మూడు స్థానాల్లోనే ఉంటుందన్నారు.

More Telugu News