Andhra Pradesh: సమైక్య ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని చంద్రబాబు నిషేధించారు!: హరీశ్ రావు

  • చంద్రబాబు తెలంగాణ రాష్ట్ర వ్యతిరేకి
  • అసెంబ్లీలో ఆ పదాన్నే నిషేధించారు
  • బోనంపై ‘జై తెలంగాణ’ ఉంటే ఒప్పుకోలేదు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి నరనరానా తెలంగాణ వ్యతిరేకత ఉందని టీఆర్ఎస్ నేత, మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. సమైక్య రాష్ట్రంలో అసెంబ్లీలో తెలంగాణ అన్న పదాన్ని నిషేధించిన ఘనత చంద్రబాబుదని ఎద్దేవా చేశారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరగడంతోనే కేసీఆర్ తన పదవికి రాజీనామా సమర్పించి 2001లో టీఆర్ఎస్ ను స్థాపించారని గుర్తుచేశారు.

కానీ చంద్రబాబు మాత్రం ప్రత్యేక తెలంగాణ ఇవ్వొద్దని అప్పటి ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ రాశారని విమర్శించారు. ఐదు సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించాలా? అని చంద్రబాబు అప్పట్లో స్టేట్ మెంట్లు కూడా ఇచ్చారన్నారు. తెలంగాణ భవన్ లో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన హరీశ్.. అప్పటి పత్రికల క్లిప్పింగ్స్ ను మీడియా ముందు ప్రదర్శించారు.

తెలంగాణ అన్న ఆలోచనను తట్టుకోలేని టీడీపీ నేతలు ఏకంగా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై 2002 ప్రాంతంలో దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. అప్పట్లో జలదృశ్యం వద్ద ఉన్న పార్టీ ఆఫీసులోకి దూరిన టీడీపీ నేతలు, కార్యకర్తలు కుర్చీలు, బల్లలను లాగేసి ఇందిరా పార్క్ వద్ద పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

బోనం ఉత్సవాల సందర్భంగా ‘జై తెలంగాణ’ బోనం ఎత్తుకోవడానికి చంద్రబాబు నిరాకరించారనీ, జై తెలుగుదేశం బోనాన్ని ఎత్తుకున్నారని విమర్శించారు. హైకోర్టు విభజన, కాళేశ్వరం అనుమతులు, సీతారామా, పాలమూరు ఎత్తిపోతల పథకాలు, తెలంగాణకు విద్యుత్ సరఫరా సహా చాలా విషయాల్లో తెలంగాణకు వ్యతిరేకంగా చంద్రబాబు వ్యవహరించారని హరీశ్ రావు ఆరోపించారు.

More Telugu News