bjp: భారీ విరాళాలతో.. దేశంలోనే అత్యంత సంపన్నమైన పార్టీగా అవతరించిన బీజేపీ!

  • 2017-18లో బీజేపీకి వచ్చిన విరాళాలు వెయ్యి కోట్లు
  • ఈసీకి సమర్పించిన వార్షిక ఆదాయ నివేదికలో వెల్లడి
  • మేము పారదర్శకంగా ఉంటాం
  • అందుకే, పెద్దమొత్తంలో విరాళాలు: గోపాల్ అగర్వాల్

దేశంలోనే అత్యంత సంపన్నమైన పార్టీగా బీజేపీ అవతరించింది. గత ఆర్థిక సంవత్సరం 2017-18లో బీజేపీకి విరాళాల రూపంలో వచ్చిన మొత్తం రూ.1000 కోట్లు. ఈ వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించిన వార్షిక ఆదాయ నివేదికలో బీజేపీ వెల్లడించింది.

ఈ విషయమై బీజేపీ అధికార ప్రతినిధి గోపాల్ అగర్వాల్ మాట్లాడుతూ, ఆర్థిక వ్యవహారాల్లో తాము పారదర్శకంగా వ్యవహరిస్తున్నందువల్లే తమ పార్టీకి ఇంత పెద్ద మొత్తంలో విరాళాలు వస్తున్నాయని అన్నారు. తమ విరాళాలన్నీ చెక్కులు, ఆన్ లైన్ విధానం ద్వారానే స్వీకరిస్తామని, కొంతమంది అభిమానులు నమో యాప్ ద్వారా కూడా విరాళాలు పంపుతున్నట్టు చెప్పారు. బీజేపీ ప్రతి లావాదేవీ విషయంలో పారదర్శకంగా ఉంటుందని, ఆడిట్ నివేదికలతో సహా ఎన్నికల సంఘానికి సమర్పిస్తుందని చెప్పారు.

ఇదిలా ఉండగా, ఈ ఏడాది మార్చి నాటికి దేశంలోని నాలుగు రాజకీయ పార్టీలు గతంలో కన్నా ఎక్కువ విరాళాలను పొందాయి. విరాళాల విషయంలో బీజేపీ తర్వాతి స్థానంలో బహుజన్ సమాజ్ పార్టీ ఉంది. గతంతో పోలిస్తే బీఎస్పీ విరాళాలు రూ.681 కోట్ల నుంచి రూ.717కోట్లకు పెరిగాయి. 2016-17లో   రూ.262 కోట్లుగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆదాయం..రూ.291 కోట్లకు చేరింది. అదేవిధంగా, గత ఆర్థిక సంవత్సరంలో సీపీఎంకు రూ.104 కోట్ల విరాళాలు రాగా, సీపీఐ కి రూ.1.5 కోట్లు వచ్చాయి.

More Telugu News