Andhra Pradesh: టీడీపీ నేతలు 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నా ఏమాత్రం మారలేదు!: పవన్ కల్యాణ్

  • కుల రాజకీయాలు వస్తే ఏపీ నాశనమే
  • తెలంగాణ గొడవలో ప్రజలు చితికిపోయారు
  • జనసేనలో చేరిన రావెల కిశోర్ బాబు

ఆంధ్రప్రదేశ్ లో బిహార్, ఉత్తరప్రదేశ్ తరహా కుల రాజకీయాలు వస్తే రాష్ట్రం నాశనం అయిపోతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హెచ్చరించారు. తద్వారా అభివృద్ధి పూర్తిగా కుంటుపడుతుందని వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఆంధ్రా, తెలంగాణ గొడవల్లో ప్రజలు చితికిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఏపీలో ఓ రెండు కులాలను రెచ్చగొట్టి, మరో రెండు కులాలపై ఎగదోసే ప్రయత్నాలు సాగుతున్నాయని ఆరోపించారు. ఇలాంటి చర్యలతో రాష్ట్రంలో అశాంతి తప్ప మరేది ఉండదని స్పష్టం చేశారు. ఏపీ మాజీ మంత్రి రావెల కిశోర్ బాబును పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు.

ఇప్పటికైనా ఇలాంటి కుల రాజకీయాలను అడ్డుకుంటారన్న ఉద్దేశంతోనే తాను 2014లో టీడీపీకి మద్దతు ఇచ్చానని పవన్ కల్యాణ్ తెలిపారు. అయితే ఆ పార్టీ నేతలు 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నా ఏమాత్రం మారలేదని విమర్శించారు. ఇసుక మాఫియా, మహిళలపై దాడులతో చంద్రబాబు ప్రభుత్వం ప్రజల మద్దతును కోల్పోయిందన్నారు. చంద్రబాబు జనసేన అభివృద్ధికి సాయం చేస్తారని తాను ఎప్పుడూ ఆశించలేదన్నారు.

రాష్ట్రంలో అవినీతిరహిత ప్రభుత్వం వస్తుందని మాత్రమే ఆశించానని వెల్లడించారు. అయితే రాష్ట్రమంతటా ఇప్పుడు తీవ్రమైన అశాంతి పరిస్థితులు, అవినీతి విలయతాండవం చేస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో విజన్ 2050 ఎలా సాధ్యమని ప్రశ్నించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News