IThiyopia: ఇథియోపియాలో కలకలం... ఏడుగురు ఐఎల్ఎఫ్ఎస్ భారత ఉద్యోగులను బంధించిన లోకల్ ఉద్యోగులు!

  • ఇథియోపియాలో ప్రాజెక్టులు రద్దు చేసుకున్న సంస్థ
  • తమ ఉపాధి పోయిందన్న ఆందోళనలో స్థానికులు
  • అక్కడి అధికారులతో మాట్లాడుతున్నామన్న విదేశాంగ శాఖ

ఏడుగురు భారత ఉద్యోగులను ఇథియోపియాలోని ఐఎల్ఎఫ్ఎస్ కార్యాలయంలో స్థానిక ఉద్యోగులు బంధించడంతో తీవ్ర కలకలం ఏర్పడింది. అక్కడి ఐఎల్ఎఫ్ఎస్ అనుబంధ సంస్థ చేపట్టిన కొన్ని రహదారి ప్రాజెక్టులను రద్దు చేసుకోవడంతో, తమకు ఉపాధి కరవైందన్న భావనలోకి వచ్చిన స్థానిక ఉద్యోగులు ఈ పని చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయమై స్పందించిన భారత విదేశాంగ శాఖ, ఇథియోపియా ప్రభుత్వంతో మాట్లాడామని పేర్కొంది.

కాగా, ఇథియోపియాలో స్థానిక ఉద్యోగులకు గత కొంత కాలంగా ఐఎల్ఎఫ్ఎస్ వేతనాలు చెల్లించడం లేదని తెలుస్తోంది. గత సంవత్సరం ఆగస్టు నుంచి ఐఎల్ఎఫ్ఎస్ పాత రుణాల చెల్లింపులను నిలిపివేసింది. పలు ప్రాజెక్టుల్లో నష్టాల కారణంగా ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేకపోయింది. ఇదే సమయంలో ప్రాజెక్టులను రద్దు చేసుకోవడంతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది.

కాగా, ఏడుగురు భారత ఉద్యోగులూ క్షేమంగానే ఉన్నారని, వారిని విడిపించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నామని విదేశాంగ శాఖ తెలిపింది. కాగా, భారత ఐఎల్ఎఫ్ఎస్ విభాగం మాత్రం ఇథియోపియాకు అదనపు నిధులు పంపించేందుకు అవకాశం లేదని వెల్లడించింది.

More Telugu News