SBI: మీ ఎస్‌బీఐ ఖాతాతో మొబైల్ నంబరు అనుసంధానం చేసుకున్నారా?.. నేడే ఆఖరు.. ఇలా చెక్ చేసుకోండి!

  • మొబైల్ నంబరు అనుసంధానానికి నేడే ఆఖరు
  • ఖాతా ఎక్కడున్నా సమీప బ్రాంచ్‌కి వెళ్తే పని అవుతుంది
  • లేదంటే రేపటి నుంచి సేవల నిలిపివేత

ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు వినియోగించుకుంటున్న భారతీయ స్టేట్ బ్యాంకు ఖాతాదారులకు నేడే చివరి అవకాశం. తమ ఖాతాతో మొబైల్ నంబరును అనుసంధానం చేసుకోని ఖాతాదారుల ఆన్‌లైన్ సేవలు రేపటితో ఆగిపోనున్నాయి. కాబట్టి ఖాతాదారులందరూ ఒకసారి తమ మొబైల్ నంబరు ఖాతాతో అనుసంధానం అయిందీ లేనిదీ చూసుకోవడం మంచిది. మొబైల్ నంబరును అనుసంధానం చేసుకోని వారు తమ బ్యాంకు శాఖ ఎక్కడో ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఖాతా ఏ బ్రాంచ్‌లో ఉన్నా సమీపంలోని ఎస్‌బీఐ బ్రాంచ్‌కు వెళ్లి అనుసంధానం చేసుకోవచ్చు. మొబైల్ నంబరును అనుసంధానం చేసుకోకుంటే డిసెంబరు 1 నుంచి ఆన్‌లైన్ సేవలు ఆగిపోతాయని భారతీయ రిజర్వు బ్యాంకు చాలా రోజులుగా హెచ్చరిస్తూనే ఉంది.

ఖాతాదారుల భద్రత కోసం పటిష్ఠ చర్యలు చేపడుతున్న ఆర్‌బీఐ గతేడాది జూలైలోనే బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఖాతాదారులందరూ తమ మొబైల్ నంబరును ఖాతాతో జత చేసుకోవాలని కోరింది. ఇలా చేయడం వల్ల లావాదేవీ జరిగే ప్రతిసారీ ఎస్సెమ్మెస్ వస్తుంది. ఒకవేళ ఈమెయిల్ ఐడీని కూడా నమోదు చేసుకుంటే దానికి కూడా సందేశం వస్తుంది. దీనివల్ల లావాదేవీలకు మరింత భద్రత ఉంటుంది.

తమ మొబైల్ నంబరు బ్యాంకులో నమోదైందీ లేనిదీ ఎస్‌బీఐ వెబ్‌సైట్‌లోకి వెళ్లి తెలుసుకోవచ్చు. onlinesbi.comలో లాగిన్ అయి మన ఖాతా ఓపెన్ చేయాలి. అనంతరం మై అకౌంట్స్‌లోని ప్రొపైల్‌ను క్లిక్ చేస్తే మొబైల్ నంబరు ఉంటే కనిపిస్తుంది. లేదంటే వెంటనే సమీపంలోని ఎస్‌బీఐ బ్రాంచ్‌కు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి.

More Telugu News