Kadapa District: కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై కేంద్రం దొంగ కారణాలు చెబుతోంది!: సీఎం రమేశ్

  • ఏపీ పట్ల కక్షపూరితంగా వ్యవహరించారు
  • రాయితీలు ఇచ్చేందుకు నిరాకరించారు
  • హామీలు నెరవేర్చమంటే ఐటీ దాడులు చేస్తున్నారు

కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కడప ఉక్కు కర్మాగారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించాలని నిర్ణయించిందని టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఎన్ని కష్టాలు ఎదురైనా కడప ఉక్కు కర్మాగారాన్ని నిర్మించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. కడప జిల్లాలోని మైలవరం మండలం కంబాల దిన్నెలో ఈ స్టీల్ ప్లాంటును ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్ లో ఈరోజు తన స్వగృహంలో మీడియాతో మాట్లాడారు.

విభజన తర్వాత ఆర్థిక కష్టాలతో సతమతం అవుతున్న ఆంధ్రప్రదేశ్ కు కనీసం రాయితీలు ఇచ్చేందుకు కూడా కేంద్రం ముందుకు రాలేదని సీఎం రమేశ్ అన్నారు. కడపలో ఉక్కు కర్మాగారం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తామన్నారు. ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు సంబంధించిన వివరాలు సమర్పించలేదని కేంద్రం దొంగ కారణాలు చెబుతోందని విమర్శించారు.

ఏపీ ప్రభుత్వం ప్లాంట్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే చాలాసార్లు ప్రాజెక్టు సమగ్ర నివేదిక(డీపీఆర్)ను కేంద్రానికి అందజేసిందని స్పష్టం చేశారు. కడప ప్రజల కోసం నాలుగున్నరేళ్లు పోరాడామనీ, తాను, బీటెక్ రవి కలిసి దీక్ష చేశామని గుర్తుచేశారు. అప్పట్లో 10 రోజుల్లోనే నిర్ణయం తీసుకుంటామన్న కేంద్ర ఉక్కు మంత్రి, ఆ తర్వాత తనతో పాటు టీడీపీ నేతలపై ఐటీ దాడులతో వేధిస్తున్నారని ఆరోపించారు.

More Telugu News