Shujaat Bukhari: లష్కరే ఉగ్రవాది, కసబ్ సన్నిహితుడు నవీద్ జట్ హతం

  • భద్రతా దళాల ఎన్‌కౌంటర్‌లో హతమైన ఉగ్రవాది
  • రైజింగ్ కశ్మీర్ ఎడిటర్‌ను హత్య చేసింది అతడే
  • 20 ఏళ్లకే కరుడుగట్టిన ఉగ్రవాదిగా మారిన వైనం
జమ్ముకశ్మీర్‌లోని బుద్గాం జిల్లా కుత్పోరాలో భద్రతా దళాలకు ఉగ్రవాదులకు మధ్య జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో లష్కరే తాయిబా ఉగ్రవాది, అజ్మల్ కసబ్ సన్నిహితుడు నవీద్ జట్ హతమయ్యాడు. ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారంతో బుధవారం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టిన భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ప్రతిగా భద్రతా దళాలు ఎదురు కాల్పులు ప్రారంభించాయి. ఈ ఘటనలో 20 ఏళ్ల నవీద్ జట్ ప్రాణాలు కోల్పోయాడు. ముగ్గురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు.

హతమైన నవీద్ జట్‌ కరుడుగట్టిన ఉగ్రవాది. పోలీసుల కళ్లుగప్పి తప్పించుకోవడంలో దిట్ట అయిన అతడికి ఎస్కేప్ ఆర్టిస్ట్‌గా పేరుంది. ముంబైలో మారణహోమం సృష్టించిన కసబ్‌తో కలిసి లష్కరే తాయిబా శిబిరంలో శిక్షణ పొందాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో భద్రతా దళాలకు పట్టుబడ్డాడు. వైద్య పరీక్ష నిమిత్తం శ్రీనగర్ సెంట్రల్ జైలు నుంచి ఆసుపత్రికి తరలిస్తుండగా ఇద్దరు పోలీసులను చంపి పరారయ్యాడు. అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్న నవీద్ రైజింగ్ కశ్మీర్ పత్రిక ఎడిటర్ షుజాత్ బుఖారీని హత్య చేశాడు. తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు.
Shujaat Bukhari
Naveed Jatt
LeT terrorist
Jammu And Kashmir

More Telugu News