Congress: నేడు అరుదైన దృశ్యం... తెలంగాణ వచ్చాక తొలి బహిరంగ సభలో మాట్లాడనున్న చంద్రబాబు!

  • నేడు రాహుల్, చంద్రబాబు కలసి బహిరంగ సభ
  • సభలో పాల్గొననున్న ప్రజా కూటమి నేతలు
  • భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్న కాంగ్రెస్, టీడీపీ

నిన్నమొన్నటి వరకూ బద్ధ శత్రువులుగా ఉండి, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న కాంగ్రెస్, తెలుగుదేశం నేతలు ఇప్పుడు స్నేహితులుగా మారి ఒకటైన వేళ, ఇరు పార్టీల జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ, చంద్రబాబునాయుడులు కలసి ఒకే బహిరంగ వేదికను నేడు పంచుకోనున్నారు. ఇదే ఓ అరుదైన దృశ్యం అయితే, ఈ బహిరంగ సభ, ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తరువాత చంద్రబాబు పాల్గొంటున్న తొలి సభ కావడంతో ఆయన ఏం మాట్లాడతారన్న విషయమై ఆసక్తి నెలకొంది.

ఖమ్మంలో ఈ బహిరంగ సభ జరగనుండగా, రాహుల్ గాంధీ, చంద్రబాబునాయుడుతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎల్ రమణ, కోదండరామ్, గద్దర్, నామా నాగేశ్వరరావు, చాడ వెంకటరెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, రేణుకాచౌదరి, కుంతియాలతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజా కూటమి తరఫున బరిలోకి దిగిన 10 మంది అభ్యర్థులు కూడా పాల్గొంటారు. నేటి మధ్యాహ్నం 2 గంటల తరువాత రాహుల్, చంద్రబాబులు వేర్వేరు హెలికాప్టర్లలో సభా వేదిక వద్దకు చేరుకోనున్నారు. ఈ సభకు ఏర్పాట్లు పూర్తికాగా, పెద్దఎత్తున జన సమీకరణ చేసేందుకు కాంగ్రెస్, టీడీపీ నేతలు రంగంలోకి దిగారు.

More Telugu News