Telangana: అమరుల త్యాగాన్ని వృథా చేస్తున్న కేసీఆర్... నరేంద్ర మోదీ ఎటాక్!

  • దశాబ్దాల పోరాట ఫలితంగా ఏర్పడిన తెలంగాణ
  • టీఆర్ఎస్ చేసిందేమీ లేదు
  • ప్రజలు బుద్ధి చెప్పే సమయం వచ్చింది
  • కేసీఆర్ లక్ష్యంగా మోదీ విమర్శలు

తెలంగాణ రాష్ట్రం ఎన్నో దశాబ్దాల ప్రజల పోరాట ఫలితంగా ఏర్పడిందని, ఎంతో మంది యువకులు బలిదానాలు ఈ ఉద్యమం వెనకున్నాయని, వారి త్యాగాలను ప్రస్తుత పాలకులు వృథా చేస్తున్నారని, దీన్నిక సాగనివ్వబోమని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తున్న ఆయన, టీఆర్ఎస్, కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజలు కన్న కలలు సాకారం కావడం లేదని, వాటిని నెరవేర్చాల్సిన స్థానంలో ఉన్న ప్రభుత్వం ఆ పని చేయడం లేదని నిప్పులు చెరిగారు.

"తెలంగాణ ఏర్పడి నాలుగున్నరేళ్లు అయింది. ఈ ప్రభుత్వం ఏం పని చేసింది. ఇది ఎన్నికల సమయం. ఈ నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం ఏం చేసిందన్న విషయం పైసాపైసా లెక్క అడగాల్సిన సమయం ఇది. ఇక్కడి యువత, రైతులు, దళితులు, బడుగు బలహీన వర్గాలు, ఆదివాసీల అభ్యున్నతికి ఇచ్చిన హామీల్లో ఏం నెరవేర్చారు? ఏం అభివృద్ధి సాధించారు? వాగ్దానాల అమలులో ప్రభుత్వ వైఫల్యంపై సమాధానం చెప్పి తీరాల్సిందే.

ఇక్కడి ముఖ్యమంత్రి, ఆయన కుటుంబీకులు ఏమనుకుంటున్నారంటే, దశాబ్దాలుగా ఏమీ చేయని కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ ప్రభుత్వం స్థాపిస్తుంటే, తాము కూడా ఏమీ చేయకుండానే గెలవచ్చని భావిస్తున్నారు. అది ఎన్నటికీ జరగదు. జరగబోదు. కాంగ్రెస్ వారి అడుగుజాడల్లోనే ఇక్కడి సీఎం నడుస్తున్నారు. ఈ దేశం యువతది. యువత బుద్ధి చెప్పే రోజు ఎంతో కాలంలో లేదు" అని విమర్శలు గుప్పించారు నరేంద్ర మోదీ.

More Telugu News