Telangana: అదే జరిగితే గాంధీభవన్ ముఖం కూడా చూడను: ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

  • ప్రజా కూటమి ఓడినా, గెలిచినా బాధ్యత నాదే
  • ఓడిపోతే గాంధీ భవన్ మెట్లు ఎక్కబోను
  • కేసీఆర్ దళిత ద్రోహి
  • ఎస్సీల వర్గీకరణను పూర్తి చేస్తామన్న ఉత్తమ్

తెలంగాణ ఎన్నికల్లో ప్రజా కూటమి ఓడిపోతే, డిసెంబర్ 11 తరువాత తాను గాంధీభవన్ ముఖం చూడబోనని, కాలు పెట్టబోనని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి గెలిచినా, ఓడినా బాధ్యత తనదేనని చెప్పిన ఆయన, తాము ఓడిపోతే గాంధీ భవన్ బాధ్యతలను ఉపాధ్యక్షుడు కుమార్ రావు చూసుకుంటారని అన్నారు.

ఎస్సీ వర్గీకరణపై మంద కృష్ణ మాదిగ, కుంతియాలతో కలసి చర్చించిన ఆయన, ఆపై మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో దళిత ద్రోహి ఎవరైనా ఉన్నారంటే, అది కేసీఆర్ మాత్రమేనని, రాష్ట్రం వస్తే, దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన ఆయన, మోసం చేశారని ఆరోపించారు. 2009లో ఎంఆర్పీఎస్ అండతోనే ఆమరణ దీక్ష చేసిన కేసీఆర్, ఆపై ఎస్సీ వర్గీకరణను అటకెక్కించారని నిప్పులు చెరిగారు.

కూటమి గెలిస్తే, మాదిగ నేతలకు రాజ్యసభ సభ్యులుగా, ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తామని అన్నారు. ఈ సందర్భంగా మహాకూటమికి తాము మద్దతు పలుకుతున్నట్టు ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ తెలిపారు.

More Telugu News