praja kutami: ప్రజలపై వరాల జల్లు కురిపించిన ప్రజాకూటమి.. హామీలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి!

  • కామన్ మినిమమ్ ప్రోగ్రాంను విడుదల చేసిన ప్రజాకూటమి
  • అన్ని వర్గాలపైనా వరాల జల్లు
  • కోదండరాంకు కేబినెట్ మంత్రి హోదా

తెలంగాణ శాసనసభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రజాకూటమి ప్రజలపై వరాల వర్షం కురిపించింది. ఉక్కిరిబిక్కిరి చేసే హామీలతో ముందుకొచ్చింది. సోమవారం ఓ హోటల్‌లో సమావేశమైన టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ, సీపీఐ రాష్ట్ర ఇన్‌చార్జి కార్యదర్శి పల్లా వెంకట్‌ రెడ్డి, టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాంలు కూటమి కనీస ఉమ్మడి ప్రణాళిక (సీఎంపీ)ను విడుదల చేశారు.  

సీఎంపీ ప్రకారం.. గృహ విద్యుత్ వినియోగదారులకు వంద యూనిట్ల లోపు విద్యుత్తు పూర్తిగా ఉచితం. అదే ఎస్సీ, ఎస్టీలకైతే 200 యూనిట్ల వరకు ఉచితం. ఈ హామీతో రాష్ట్రవ్యాప్తంగా 70 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే లక్ష ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తారు. ఫలితంగా వాటి రేట్లు తగ్గుముఖం పడతాయి. తెలంగాణ ఉద్యమకారులకు పింఛన్లు ఇవ్వనున్నారు. ప్రజాకూటమి విద్యుత్ హామీ వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ. 800 కోట్ల భారం పడనుంది.

సీఎంపీ విడుదల సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. వచ్చే నెల 11న ప్రజాకూటమి ప్రభుత్వం ఏర్పడబోతోందని విశ్వాసం వ్యక్తం చేశారు. కేసీఆర్ నాశనం చేసిన వ్యవస్థలను తమ ప్రభుత్వం పునరుద్ధరిస్తుందని తెలిపారు. కొత్త జిల్లాలు, జోనల్ వ్యవస్థపై సమీక్షిస్తామని పేర్కొన్నారు.  వృద్ధాప్య పింఛను వయో పరిమితిని 58 ఏళ్లకు కుదిస్తామన్నారు. రైతులకు ఏక కాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. హామీల అమలుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని, దీనికి కోదండరాం చైర్మన్‌గా ఉంటారని తెలిపారు. కోదండరాంకు కేబినెట్ మంత్రి ర్యాంకు ఉంటుందన్నారు. కేసీఆర్ విస్మరించిన రంగాలకు తాము ప్రాధాన్యం ఇచ్చినట్టు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ పేర్కొన్నారు. 

More Telugu News