Sujana Chowdary: ఈడీ అధికారులు ముందే ఒక జడ్జిమెంట్ తో వచ్చారు.. సుజనా గ్రూపు కింద మూడు కంపెనీలు మాత్రమే ఉన్నాయి: సుజనా చౌదరి

  • ఈడీ అధికారులు చూపుతున్న రూ. 5,700 కోట్ల బ్యాలెన్స్ షీట్ కూడా సరికాదు
  • ఒక్క రోజు సోదాలతోనే జడ్జిమెంట్ ఇచ్చేస్తారా?
  • మా కంపెనీలలో అవకతవకలు ఉంటే.. బ్యాంకులు లోన్లు ఎందుకు ఇస్తాయి?

సుజనా గ్రూప్ కంపెనీలపై ఈడీ దాడులకు సంబంధించి టీడీపీ ఎంపీ సుజనా చౌదరి మీడియా ముఖంగా వివరణ ఇచ్చారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ఆయన తెలిపారు. రాజకీయంగా తాను క్రియాశీలకంగా ఉన్నందుకే తనను టార్గెట్ చేశారని చెప్పారు. రాజకీయంగా అణగదొక్కేందుకే కేంద్ర ప్రభుత్వం ఈడీ దాడులకు పాల్పడుతోందని తెలిపారు. తనకు ఖరీదైన భవంతులు, కార్లు లేవని చెప్పారు. హైదరాబాదులోని నాగార్జున హిల్స్ లో ఉన్న భవంతికి, తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు.

తాము పెట్టిన కంపెనీలలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సుజనా చౌదరి చెప్పారు. బ్యాంకులు ఉన్నదే అప్పులు ఇవ్వడానికని... తమ కంపెనీలలో అవకతవకలు ఉంటే బ్యాంకులు లోన్లు ఇవ్వవు కదా? అని ప్రశ్నించారు. కేవలం మూడు కంపెనీలు మాత్రమే సుజనా గ్రూప్ కింద ఉన్నాయని తెలిపారు. 30 ఏళ్ల క్రితం సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, సుజన మెటల్ ప్రాడక్ట్స్ లిమిటెడ్ అనే రెండు కంపెనీలను తాను స్థాపించానని చెప్పారు. 11 ఏళ్ల క్రితం ఒక కంపెనీ నుంచి విడిపోయి మరో కంపెనీ వచ్చిందని తెలిపారు. 29 ఏళ్ల నుంచి తన కంపెనీలకు సంబంధించిన సమాచారం వెబ్ సైట్ లో ఉందని చెప్పారు. 29 ఏళ్లుగా తన కంపెనీలు సక్రమంగా ఆడిట్ నిర్వహించాయని అన్నారు. డొల్ల కంపెనీలంటే ఏమిటో తనకు తెలియదని చెప్పారు.

ఈడీ అధికారులు చూపుతున్న రూ. 5,700 కోట్ల బ్యాలెన్స్ షీట్ కూడా సరికాదని సుజనా చౌదరి అన్నారు. ఒక్కరోజు సోదాలతోనే వారు తుది నిర్ణయానికి ఎలా వస్తారని ప్రశ్నించారు. ముందే ఒక నిర్ణయంతో దాడి చేసినట్టు కనబడుతోందని అన్నారు. ఈడీ అధికారులు బాధ్యతారహితంగా మాట్లాడటం తనకు కూడా ఆశ్చర్యంగానే ఉందని చెప్పారు.

అడ్డంగా వాదించే రాజకీయ నాయకులు, తప్పుడు కథనాలను ప్రచురించే మీడియా సంస్థల గురించి తాను కామెంట్ చేయబోనని సుజనా చౌదరి అన్నారు. తాను ప్రమోట్ చేసిన కంపెనీలన్నీ చట్టబద్ధంగానే ఉన్నాయని తెలిపారు. బ్యాంకుల్లో అప్పులు తీసుకోవడం నేరం కాదని చెప్పారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయకుండానే... రాత్రికి రాత్రే ఈడీ అధికారులు జడ్జిమెంట్ కు ఎలా వస్తారని ప్రశ్నించారు.

More Telugu News