Telangana: ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లా.. ఏ సామాజిక వర్గానికి కోత విధిస్తారు?: కేసీఆర్ కు అమిత్ షా సూటి ప్రశ్న

  • మజ్లిస్ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకోవడం లేదు
  • ముందస్తుతో ప్రజలపై భారీ భారాన్ని మోపారు
  • పరకాల సభలో విమర్శలు గుప్పించిన షా

డిసెంబర్ 7న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించనున్నాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. ఒవైసీ, మజ్లిస్ సాయంతో నడిచే ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు కోరుకోవడం లేదని వ్యాఖ్యానించారు. మజ్లిస్(ఏఐఎంఐఎం) పార్టీ సాయం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కాంగ్రెస్ కు చేతకాదనీ, అది బీజేపీకి మాత్రమే సాధ్యమని స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికల పేరుతో తెలంగాణ ప్రజలపై కేసీఆర్ అదనపు భారాన్ని మోపారని విమర్శించారు. 2019లో పార్లమెంటు ఎన్నికలతో అసెంబ్లీ ఎన్నికలను కలిపి నిర్వహిస్తే ప్రజలకు ఉపశమనం కలిగేదని చెప్పారు. తెలంగాణలోని పరకాలలో ఈ రోజు నిర్వహించిన బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడారు.

ప్రధాని మోదీ చరిష్మాకు భయపడే ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లారని అమిత్ షా ఆరోపించారు. 2014లో మోదీ ప్రధాని అయ్యాక కాంగ్రెస్ పార్టీ గత 60 ఏళ్లలో చేపట్టలేని పలు అభివృద్ధి పనులను తమ ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదాను కాంగ్రెస్ పార్టీ 1955 నుంచి నానబెడుతుంటే తమ ప్రభుత్వం నాలుగేళ్లలోనే ఇచ్చిందని గుర్తుచేశారు. 50 శాతానికి మించి రిజర్వేషన్ ఇవ్వరాదని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నాయనీ, అలాంటప్పుడు ఎవరి రిజర్వేషన్ కు కోత విధించి ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఆర్థిక స్థితి, వెనుకబాటు ఆధారంగానే రిజర్వేషన్లు కల్పించాలని అమిత్ షా స్పష్టం చేశారు. మతం ఆధారంగా బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లను ఇవ్వబోదనీ, అలా ఇచ్చేవారిని అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు. బీజేపీ దళితులు, ఓబీసీలు, గిరిజనుల రిజర్వేషన్ల కోసం కట్టుబడి ఉందని తేల్చిచెప్పారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడ్డాక తెలంగాణలో అభివృద్ధి  కోసం పలు పథకాలు అందుబాటులోకి తెచ్చామన్నారు. యూపీఏ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం తప్ప మరేమీ చేయలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ హయాంలో 13వ ఆర్థిక సంఘం తెలంగాణకు కేవలం రూ.16,500 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. కానీ మోదీ ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం కింద 7 రెట్లు అధికంగా నిధులు ఇచ్చిందని గుర్తుచేశారు.

More Telugu News