Telangana: విద్యాసంస్థల నుంచి చెత్త ఏరుకునే సంఘాల వరకూ.. అందరినీ కేసీఆర్ వాడుకున్నారు!: రేవంత్ రెడ్డి

  • తెలంగాణ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టారు
  • మైనారిటీ, మహిళలకు అన్యాయం చేశారు
  • కేసీఆర్ కు ప్రజలు ఓ ఛాన్స్ ఇచ్చారు

నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ సమాజాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేశారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రజల భాగోద్వేగాన్ని రెచ్చగొట్టడానికే టీఆర్ఎస్ ఈ నినాదాన్ని ఎత్తుకుందని విమర్శించారు. తెలంగాణలో ఎన్ని సమస్యలు ఉన్నా పోరాడినందుకు తొలిసారి కేసీఆర్ కు అందరూ ఓ అవకాశం ఇచ్చారని గుర్తుచేశారు. హైదరాబాద్ లో ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రజల సానుభూతిని ఆయుధంగా వాడుకున్న కేసీఆర్.. విద్యాసంఘాల నుంచి చెత్త ఏరుకునే సంఘాల వరకూ అందరినీ మభ్యపెట్టి తనకు అనుకూలంగా వాడుకున్నారని దుయ్యబట్టారు. ఒక్కసారి తనను గెలిపిస్తే రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తానని చెప్పిన కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు. ఆయన పాలనలో ప్రజల ఆత్మగౌరవం దెబ్బతిన్నదని తెలిపారు. రాష్ట్రంలో స్వయంపాలన చోటులో కుటుంబ పాలన వచ్చి చేరిందని ఎద్దేవా చేశారు.

కేసీఆర్ డిక్షనరీలో అసలు సామాజిక న్యాయం అన్న పదమే లేదన్నారు. గిరిజనులు, మైనారిటీలు, బలహీన వర్గాలు, మహిళలకు మంత్రివర్గంలో తగిన ప్రాతినిధ్యం కల్పించలేదని స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయాల్లో పీజీలు చదువుకుంటున్న విద్యార్థులను మావోల పేరుతో చంపేసి తన ఫ్యూడల్ మనస్తత్వాన్ని సీఎం బయటపెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ వల్ల తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారుల త్యాగాలు వృథా అయ్యాయని భావించే పరిస్థితులు నెలకొని ఉన్నాయన్నారు.

More Telugu News