l ramana: కాంగ్రెస్ తో కలసి వెళ్లాలన్న ఆలోచన నాదే: ఎల్.రమణ

  • కోదండరాం, చాడలతో తానే ఈ ప్రతిపాదన తెచ్చాను
  • దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్.. ఆయనే సీఎం అయ్యారు
  • అర్థాంతరంగా ప్రభుత్వాన్ని రద్దు చేశారు

మేడ్చల్ లో మహాకూటమి తరపున కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సమావేశంలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఆసక్తికర ప్రసంగం చేశారు. కాంగ్రెస్ పార్టీతో కలసి ఎన్నికల బరిలోకి దిగాలనే ఆలోచన తనదేనని చెప్పారు. టీజేఎస్ అధినేత కోదండరాం, సీపీఐ నేత చాడ వెంకటరెడ్డిలతో ఎన్టీఆర్ భవన్ లో తాను ఈ ప్రతిపాదన తెచ్చానని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం కాంగ్రెస్ తో కలసి మహాకూటమిని ఏర్పాటు చేయాలని తొలుత ప్రతిపాదించింది తానేనని చెప్పారు.
తెలంగాణ వస్తే దళితుడిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడతానని చెప్పిన కేసీఆర్... అధికారం రాగానే తానే సీఎం అయ్యారని రమణ మండిపడ్డారు. 51 నెలలు మాత్రమే పాలించి, అర్ధాంతరంగా ప్రభుత్వాన్ని రద్దు చేశారని ఎద్దేవా చేశారు. మళ్లీ 119 మందితో కలసి తెలంగాణ సమాజంపైకి బయలుదేరారని విమర్శించారు. నాలుగు పార్టీలు కలసి ప్రజాకూటమిగా ప్రజల ముందుకు వచ్చామని... గెలిపించి, ఆశీర్వదించాలని కోరారు. 

More Telugu News