Telangana: తెలంగాణలో కూలీలకు యమ డిమాండ్... రెండు పూటలా భోజనం, రూ. 800 నగదు!

  • మందీ, మార్బలం వెంట ఉండేలా చూసుకుంటున్న అభ్యర్థులు
  • తమ రోజువారీ సంపాదనకన్నా అధికంగా డిమాండ్ చేస్తున్న కూలీలు
  • పురుషులతో పోలిస్తే, మహిళలకు ముట్టేది తక్కువే

తెలంగాణలో ఎన్నికల పుణ్యమాని రోజుకూలీలు, రెక్కాడితేగాని డొక్కాడని పేదలకు కడుపునిండా తిండి లభిస్తోంది. ఎన్నికల ప్రచారానికి వెళ్లే నాయకులకు, తమ వెంట మందీ, మార్బలం ఉండేలా చూసుకునేందుకు జెండాలను మోస్తూ, జై కొట్టేందుకు కూలీలకు భారీ ప్యాకేజీలు ఇస్తూ, వెంట తీసుకు వెళుతున్నారు. ప్రచారం జరిగే చోటుకు వాహనాల్లో తీసుకెళ్లడం, రెండు పూటలా భోజనం పెట్టి రూ. 800 వరకూ ఇస్తుండటంతో కూలీలు, పేదలు ఎన్నికల ప్రచారానికి వెళ్లేందుకే ఇష్టపడుతున్నారు. పురుషులతో పోలిస్తే మహిళలకు కాస్తంత తక్కువగా ముడుతోంది.

వీరిని తీసుకురావడం కూడా అంత సులువుగా ఏమీ లేదు. వీరికి ఫుల్ డిమాండుందిప్పుడు. తాము రోజుకు సంపాదించుకునే డబ్బు కన్నా అధికంగా ఇస్తేనే వస్తామని భీష్మించుకుని కూర్చుంటున్నారు వీరు. ఇక వీరితో డీల్ కుదిర్చి కావాల్సినంత మంది కూలీలను సమకూర్చేందుకు మధ్యవర్తులు కూడా తయారయ్యారు. ఇంటింటి ప్రచారం చేసే వేళ, వీరి అవసరం ఎక్కువగా ఉంటోంది. ప్రత్యేకించి డ్రస్ కోడ్ తో దుస్తులను వీరితో ధరింపజేసి, ప్రచారాన్ని కలర్ ఫుల్ గా మారుస్తున్నారు అభ్యర్థులు. చేతిలో జెండా, మెడలో కండువా, పార్టీ గుర్తు, చిన్నచిన్న వాహనాలు, రిక్షాబండ్లను వీరు తిప్పుతూ అభ్యర్థుల వెంట, వారి తరఫున ప్రచారం నిర్వహించే ఇతర నేతల వెంటా తిరుగుతున్నారు.

More Telugu News