Telangana: తెలంగాణలో విజయవాడ బానిసలు, ఢిల్లీ గులాములు అవసరం లేదు!: సీఎం కేసీఆర్

  • ఆంధ్రాకు దరఖాస్తులు పట్టుకెళ్లాల్సి వస్తుంది
  • మహాకూటమిని చిత్తుగా ఓడించండి
  • ఖానాపూర్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్

తనను ఎదుర్కోలేని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఏపీ సీఎం చంద్రబాబును భుజాలపై మోసుకుని వస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. ఇప్పుడు తెలంగాణపై అధికారాన్ని మరోసారి చంద్రబాబుకు అప్పగించాలా? అని సభికులను ప్రశ్నించారు. ‘కత్తిని ఆంధ్రావాడు ఇస్తాడు కానీ పొడిచేది మాత్రం మనోడే’ అని తాను గతంలో చెప్పాననీ, ఇప్పుడదే జరుగుతోందని వ్యాఖ్యానించారు. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ లో ఈ రోజు జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు.

చంద్రబాబు పెత్తనం  వస్తే తెలంగాణ దరఖాస్తులను పట్టుకుని విజయవాడకు పోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. టీఆర్ఎస్ ఓడిపోతే తనకు వచ్చే నష్టమేమీ లేదనీ, కానీ ప్రజలు మాత్రం తీవ్రంగా నష్టపోతారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రాజెక్టులు కట్టవద్దని 35 లేఖలు రాసిన వ్యక్తి, ఇప్పుడు మహాకూటమి అధికారంలోకి వస్తే ప్రాజెక్టులు కట్టనిస్తాడా? అని ప్రశ్నించారు. తెలంగాణలో విజయవాడ బానిసలు, ఢిల్లీ గులాములు అవసరం లేదని స్పష్టం చేశారు.

తెలంగాణ ఇవ్వమని కోరితే కాసు బ్రహ్మానంద రెడ్డి 450 మంది విద్యార్థులను కాల్చిచంపాడని ఆరోపించారు.తెలంగాణ ఇవ్వాలని తాను ఉద్యమిస్తే 14 ఏళ్లు సోనియాగాంధీ ఏడిపించారని కేసీఆర్ అన్నారు. అందుకే 2014లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించారని గుర్తుచేశారు. టీఆర్ఎస్ నేతలు ప్రత్యేక రాష్ట్రం కోసం రాజీనామా చేసి పోరాడుతుంటే, కాంగ్రెస్ నేతలు మాత్రం సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో ఫొటోలకు పోజులిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు చీము,నెత్తురు, పౌరుషం లేని దద్దమ్మలని వ్యాఖ్యానించారు.

చంద్రబాబును తాను ఓసారి తరిమేశాననీ, ఈసారి మాత్రం ఆ బాధ్యత తెలంగాణ ప్రజలదేనని స్పష్టం చేశారు. ఎన్నికల్లో విజయం సాధించాక ఖానాపూర్ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ అభ్యర్థి రేఖానాయక్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

More Telugu News