grohe: ధనిక రియల్టర్ల జాబితా.. మైహోమ్స్ రామేశ్వరరావు, జీవీకే, అపర్ణాలకు చోటు!

  • 2018లో ధనిక రియల్టర్ల జాబితా విడుదల
  • అగ్రస్థానంలో నిలిచిన లోథా గ్రూపు
  • మూడో స్థానంలో నిలిచిన డీఎల్ఎఫ్

రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ తన స్థానాన్ని పదిలపరుచుకుంటోంది. రాష్ట్ర విభజన జరిగాక తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం క్రమంగా అభివృద్ధి చెందుతోంది. తాజాగా దేశవ్యాప్తంగా ఉన్న టాప్-15 రియల్ ఎస్టేట్ దిగ్గజాల్లో తొలిసారి తెలంగాణకు చోటుదక్కింది. ‘గ్రోహె– హురున్‌ ఇండియా రియల్‌ ఎస్టేట్‌’ 2018 సంవత్సరానికి ప్రకటించిన జాబితాలో తెలంగాణ నుంచి మైహోమ్స్ కన్ స్ట్రక్షన్స్ అధినేత జూపల్లి రామేశ్వర్‌ రావు చోటు దక్కించుకున్నారు.

ఈ జాబితాలో రూ.3,300 కోట్ల సంపదతో దేశంలో 14వ స్థానంలో, తెలంగాణలో తొలిస్థానంలో నిలిచారు. ఆయన తర్వాత తాజ్‌ అండ్‌ జీవీకే హోటల్స్‌ అధినేత జీవీకే రెడ్డి రూ.1,080 కోట్ల సంపదతో తెలంగాణలో రెండో స్థానంలో నిలిచారు. ఇక దేశవ్యాప్తంగా ఉన్న రియల్టర్ల జాబితాలో ఆయన 63వ స్థానంలో ఉన్నారు. అలాగే అపర్ణా కన్‌స్ట్రక్షన్స్‌ అండ్‌ ఎస్టేట్స్‌ ప్రతినిధులు సి.వెంకటేశ్వర రెడ్డి, ఎస్‌ సుబ్రమణ్యం రెడ్డిలు రూ.980 కోట్లతో తెలంగాణలో మూడోస్థానంలో, జాతీయ స్థాయిలో 66వ స్థానంలో నిలిచారు.

2018 గ్రోహే హురూన్‌ రియల్టీ ధనవంతుల్లో లోధా గ్రూప్‌నకు చెందిన మంగల్‌ ప్రభాత్‌ లోధా రూ.రూ.27,150 కోట్లతో అగ్రస్థానం దక్కించుకున్నారు. అలాగే రూ.23,160 కోట్లతో ఎంబసీ అధినేత జితేంద్ర విర్వాణీ రెండో స్థానంలో, రూ.17,690 కోట్ల సంపదతో డీఎల్‌ఎఫ్‌కు చెందిన రాజీవ్‌ సింగ్‌ మూడో స్థానంలో నిలిచారు. జర్మనీకి చెందిన ప్రీమియం శానీటరీ ఉత్పత్తుల తయారీ సంస్థ గ్రోహే. మన దేశంలో పుట్టి, ఇక్కడే పెరిగిన రియల్టీ వ్యాపారస్తులను మాత్రమే పరిగణనలోకి తీసుకొని ఈ నివేదికను రూపొందించింది.

దేశంలోని 100 మంది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారస్తుల మొత్తం సంపద విలువ రూ.2,36,610 కోట్లుగా ఉన్నట్లు ఈ సంస్థ లెక్కకట్టింది. 2017తో పోలిస్తే ఇది 27 శాతం పెరిగిందని వెల్లడించింది. టాప్‌–100 రియల్టీ శ్రీమంతుల్లో 78 మంది ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరులోనే ఉన్నట్లు పేర్కొంది. ఒక్క ముంబైలోనే 35 మంది దిగ్గజ రియల్టర్లు ఉండగా, ఢిల్లీలో 22 మంది, బెంగళూరులో 21, పుణెలో 5, నోయిడా, చెన్నై, గుర్గావ్, కొచ్చిల్లో ఇద్దరు చొప్పున, కోల్‌కతా, థానే, అహ్మదాబాద్‌లో ఒక్కరు చొప్పున ఉన్నట్లు తెలిపింది.

More Telugu News