jana sena: చెన్నైలో బీజేపీ, కాంగ్రెస్ లపై విరుచుకుపడిన పవన్ కల్యాణ్

  • చెన్నైలో విలేకరులతో మాట్లాడిన పవన్
  • ఏపీ విభజన సమస్యల ప్రస్తావన
  • కాంగ్రెస్, బీజేపీ అవలంబిస్తున్న విధానాలపై విమర్శ

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ‘ఎల్లారుకుం వణక్కం' అంటూ తన ప్రసంగాన్ని తమిళంలో ప్రారంభించారు. చెన్నైలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్ అక్కడి మీడియాతో మాట్లాడారు. ఏపీ విభజన సమస్యలపై మాట్లాడారు. ఈ సందర్భంగా తన పేరు పవన్ కల్యాణ్ అని, 2014లో జనసేన పార్టీని ప్రారంభించానని చెప్పారు. ఇరవై ఏళ్లు చెన్నైలో ఉన్నానని, తన తమిళంలో ఏవైనా తప్పులుంటే క్షమించాలని కోరారు. పొరుగు రాష్ట్రాల్లో కూడా తమ పార్టీ గొంతుకను వినిపించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఏపీ విభజన సమయంలో చోటుచేసుకున్న సంఘటనలను గుర్తుచేశారు. జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ అవలంబిస్తున్న విధానాలను విమర్శించారు.

ఎన్నో ఆశలతో ఏపీలో చంద్రబాబును సమర్థించాం కానీ, టీడీపీ ప్రభుత్వం పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితి ఏపీని బాధిస్తోందని, అందుకే, రాజకీయాల్లో మార్పు రావాలని, దేశాలు, రాష్ట్రాలు తిరుగుతూ తన వంతు ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా జల్లికట్టు గురించి పవన్ ప్రస్తావించారు. ఈ క్రీడ కోసం తమిళులు చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని, యువత ముందుకొస్తే ఎలాంటి మార్పు తీసుకురాగలదో చెప్పడానికి ఈ పోరాటమే నిదర్శనం అన్నారు. ఉత్తరాది ఆధిపత్యంపై దక్షిణాదిలో ఉద్యమం రావాలని పవన్ అభిప్రాయపడ్డారు.

More Telugu News