akhilesh singh yadav: నా మాట వినండి.. 200లకు పైగా సీట్లు గెలుస్తారు: కాంగ్రెస్ కు అఖిలేష్ సూచన

  • మధ్యప్రదేశ్ ఎన్నికలకు సంబంధించిన పొత్తులపై అఖిలేష్ స్పందన
  • ఎస్పీ, బీఎస్పీ, జీజీపీ లతో చేతులు కలపాలని సూచన
  • 200లకు పైగా సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందన్న అఖిలేష్

తమ మిత్రపక్షం కాంగ్రెస్ కు సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మరోసారి స్నేహ హస్తం అందించారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మీడియాతో మాట్లాడుతూ, ఈ రాష్ట్రంలో 200లకు పైగా స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని... అయితే, సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలాంటి పక్షాలతో చేతులు కలిపితేనే అది సాధ్యమని చెప్పారు.

ఇప్పటికి కూడా సమయం మించిపోయింది లేదని...  ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ కు చిన్న పార్టీలతో చేతులు కలిపే అవకాశం ఇప్పటికీ ఉందని అఖిలేష్ తెలిపారు. ఇప్పటికైనా ఇతర పార్టీలను కలుపుకుపోవాలని చెప్పారు. ఎస్పీ, బీఎస్పీలతో పాటు గోండ్వానా గణతంత్ర పార్టీని కూడా కలుపుకుంటే... మధ్యప్రదేశ్ లో 200లకు పైగా స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని తెలిపారు.

మధ్యప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పై ఇటీవల బీఎస్పీ అధినేత్రి మాయావతి తీవ్ర విమర్శలు గుప్పించారు. దిగ్విజయ్ వల్లే తాము కాంగ్రెస్ తో కలవలేకపోతున్నామని మండిపడ్డారు. ఛత్తీస్ గఢ్ ఎన్నికల్లో అజిత్ జోగికి చెందిన ఛత్తీస్ గఢ్ జనతా కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపేముందు కూడా కాంగ్రెస్ తీరుపై ఆమె అసహనం వ్యక్తం చేశారు.

మరోవైపు, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ ప్రకటించినప్పటికీ... ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి అడుగులు పడలేదు. ఈ నేపథ్యంలోనే, కాంగ్రెస్ ను ఉద్దేశించి అఖిలేష్ పైవ్యాఖ్యలు చేశారు.

More Telugu News