Guntur District: అబ్బాయి కోసం ఆశ.. ఆరో కాన్పులో తల్లీబిడ్డల మృతి

  • గుంటూరు జిల్లా గురజాలలో విషాదం
  • వరుసగా ఐదుగురు అమ్మాయిలు
  • అబ్బాయి కోసం ప్రయత్నించి ఆరో కాన్పులో మృతి

ఒక్క అబ్బాయి పుడితే చాలనుకున్న ఆ ఇల్లాలికి ఐదు కాన్పుల్లోనూ నిరాశే ఎదురైంది. వంశోద్ధారకుడి కోసం ఆశ చావని ఆమె ఆరో కాన్పులోనైనా పుడతాడని ఆశపడింది. అయితే, అదే ఆమెకు చివరి కాన్పు అవుతుందని ఊహించలేకపోయింది. అమ్మాయికి జన్మనిచ్చి అసువులు బాసింది. గుంటూరు జిల్లా గురజాలలో జరిగిందీ విషాద ఘటన.

స్థానిక ఎస్సీ కాలనీలో నివసిస్తున్న చిలుకూరి మేరీ సునీత (26)-నాగేశ్వరరావు భార్యాభర్తలు. నాగేశ్వరరావు రిక్షా కూలీ. పదేళ్ల క్రితం వివాహమైన వీరికి ప్రసన్న(9), ప్రేమవతి(7), చంద్రిక(5), సాగరమ్మ(3), మరియమ్మ(1) అనే ఐదుగురు అమ్మాయిలు జన్మించారు. అయితే, అబ్బాయి కావాలంటూ పట్టుబట్టిన ఆమె మరోమారు గర్భవతి అయింది. బంధువులు వద్దని వారించినా ఆమె వినిపించుకోలేదు.

సోమవారం పురిటి నొప్పులతో బాధపడుతూ గురజాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అమ్మాయికి జన్మనిచ్చింది. అయితే, అరగంట తర్వాత పాప మృతి చెందగా, ఆ తర్వాత కాసేపటికే సునీత కూడా మృతి చెందింది. ఆమె మృతితో కుటుంబంలో విషాదం అలముకుంది. తాము వద్దని మొత్తుకున్నా వినకుండా అబ్బాయి కావాలని పట్టుబట్టి ప్రాణాల మీదకు తెచ్చుకుందని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

More Telugu News