Kodandaram: సరైన పద్ధతిలో సీట్ల సర్దుబాటు జరగలేదు: టీజేఎస్ అధినేత కోదండరామ్

  • 8 సీట్లిస్తామని చెప్పి 6 సీట్లే ఇచ్చింది
  • స్నేహపూర్వక పోటీని విరమించుకునే అంశంపై చర్చలు
  • ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన ఆలస్యమైంది

మహాకూటమిలో సీట్ల సర్దుబాటు సరైన పద్ధతిలో జరగలేదని, తమకు 8 సీట్లిస్తామని చెప్పి, కేవలం ఆరు సీట్లే ఇచ్చిందని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, స్నేహపూర్వక పోటీని విరమించుకునే అంశంపై చర్చలు జరుగుతున్నాయని, తమ పార్టీ పోటీ చేసే స్థానాల నుంచి కాంగ్రెస్ పార్టీ విరమించుకుంటుందని భావిస్తున్నట్టు చెప్పారు.

ప్రస్తుతం గందరగోళ పరిస్థితులు నెలకొన్న కారణంగా ముస్లిం అభ్యర్థులకు సీట్లు కేటాయించలేకపోయామని స్పష్టం చేశారు. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన ఆలస్యమైందని విమర్శించారు. తాను జనగామ నుంచి పోటీ చేయాలనుకున్నానని, అయితే బీసీల కోసమే ఆ స్థానాన్ని తాను వదులుకున్నానని చెప్పారు. బీసీల కోసం తాము జనగామ స్థానాన్ని వదులుకుంటే, మిర్యాలగూడ సీటును తమకు కేటాయిస్తుందనుకున్నామని, ఆ సీటును ఆర్.కృష్ణయ్యకు ఇచ్చిందని విమర్శించారు.

ఈ నెల 23న మేడ్చల్ లో జరగనున్న కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు హాజరుకావాలని తనకు ఆహ్వానం అందిందని చెప్పారు. ఈ సభకు తాను వెళ్తున్నట్టు కోదండరామ్ స్పష్టం చేశారు.

More Telugu News