Visweswar Reddy: తెలంగాణ వ్యతిరేకులకు ప్రాధాన్యత కల్పించారు.. ఈ పరిస్థితుల్లో పార్టీలో కొనసాగలేను: రాజీనామా లేఖలో ఎంపీ విశ్వేశ్వరరెడ్డి

  • రాజీనామా కారణాలను లేఖలో విశ్లేషించిన ఎంపీ
  • ఇటీవలి పరిణామాలు తీవ్రంగా బాధించాయి
  • తెలంగాణ వ్యతిరేకుల్ని పార్టీలో చేర్చుకున్నారు
  • నిరాడంబరంగా, చిత్తశుద్ధితో పనిచేశా
  • పార్టీ నిర్ణయాలను ఎప్పుడూ ప్రశ్నించలేదు
చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వరరెడ్డి రాజీనామా చేయడం తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఇక టీఆర్ఎస్ పార్టీకైతే అది కోలుకోలేని దెబ్బే. తన రాజీనామా లేఖను విశ్వేశ్వరరెడ్డి తెలంగాణ భవన్‌కు పంపించారు. ఆ లేఖలో తాను రాజీనామా చేయడానికి గల కారణాలను ఆయన విశ్లేషించారు. పార్టీ కోసం తాను శ్రమించిన విధానాన్ని.. ఓడిపోయే సీటును కేటాయించినప్పటికీ తన కష్టంతో ప్రజల ఆశీర్వాదంతో తాను గెలిచిన తీరును లేఖలో విశ్వేశ్వరరెడ్డి ప్రస్తావించారు.

తొలిసారి ఎంపీగా గెలుపొందినప్పటికీ పార్లమెంటులో 90 సార్లు మాట్లాడానని.. తెలంగాణకు ఎయిమ్స్ సాధనలో కీలక పాత్ర పోషించానని చెప్పుకొచ్చారు. కానీ పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు తనను తీవ్రంగా బాధించాయని పేర్కొన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన వారిని పార్టీలో చేర్చుకుని మంత్రి పదవులిచ్చి ప్రాధాన్యత కల్పించారని ఆరోపించారు. తన నియోజకవర్గానికి న్యాయం జరగకపోవడం తనకు తీవ్ర అసంతృప్తిని మిగిల్చిందని లేఖలో వివరించారు. పార్టీలో నిరాడంబరంగా, చిత్తశుద్ధితో పనిచేశానని.. పార్టీ నిర్ణయాలను ఎప్పుడూ ప్రశ్నించలేదని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలో కొనసాగలేనని.. లేఖలో విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు.
Visweswar Reddy
Chevella MP
TRS
Telangana Bhavan

More Telugu News