Telangana: ట్రెండ్ మార్చిన టీఆర్ఎస్... ఎలక్షన్ కమిషన్ చూస్తోంది మరి!

  • అభ్యర్థి గరిష్ఠ పరిమితి ఖర్చు రూ. 28 లక్షలు
  • ప్రతి పైసాకూ లెక్క చెప్పాల్సిన పరిస్థితి
  • ఖర్చును గణనీయంగా తగ్గించుకున్న అభ్యర్థులు
  • సాదాసీదా ఏర్పాట్లతోనే బహిరంగ సభలు

టీఆర్ఎస్ బహిరంగ సభ అంటే... భారీ కటౌట్ లు, పెద్ద పెద్ద హోర్డింగులు, స్వాగత ద్వారాలు, ఒకేలా కనిపించే గులాబీ రంగు టీషర్టులు, నగరమంతా ప్లెక్సీలు... ఇదంతా నిన్నటి మాట. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ప్రతి పైసాకు లెక్క చెప్పాల్సి రావడం, అభ్యర్థుల గరిష్ఠ పరిమితి రూ. 28 లక్షలు కావడంతో, ఆ పార్టీ ప్రచార సభల ట్రెండ్ మారింది. నిన్న తెరాస అధినేత కేసీఆర్, ఖమ్మం జిల్లాలో పర్యటించిన వేళ, బహిరంగ సభల్లో నిరాడంబరత్వం కొట్టొచ్చినట్టు కనిపించింది.

నామినేషన్ వేసినప్పటి నుంచి ప్రచారం ముగిసేంతవరకూ ప్రతి పైసా లెక్కనూ ఎలక్షన్ కమిషన్ తరచితరచి చూస్తుందన్న సంగతి తెలిసిందే. ఇక ప్రచార సభలు పెట్టి, స్వాగత ద్వారం ఏర్పాటు చేస్తే రూ. 2,500, కార్పెట్ వేస్తే రూ. 250, కటౌట్ పెడితే రూ. 5 వేలు, హోర్డింగ్ పెడితే రూ. 15 వేలు, టోపీకి రూ. 50, కండువాకు రూ. 10, పార్టీ లోగోతో టీషర్టు వేసుకుంటే రూ. 150 లెక్క కడుతుంది ఈసీ. దీన్ని దృష్టిలో ఉంచుకోకుండా, గతంలోలా బహిరంగ సభను పెడితే, ఒక్క సభకే రూ. 28 లక్షల ఖర్చూ దాటిపోతుంది.

ఆపై ప్రచారానికి మైక్ సెట్టు, వాహనం కూడా అద్దెకు పెట్టుకునే వీలుండదు. అందుకే, టీఆర్ఎస్ పార్టీ తన ప్రచార సభల్లో హంగు, ఆర్భాటాలకు దూరంగా ఉండాలని నిర్ణయించింది. ఏ ప్రాంతంలో సభ జరిగితే, అక్కడి నుంచి పోటీ పడుతున్న ఆ అభ్యర్థి ఖర్చులో లెక్కను చూపాల్సి వుంటుంది. అందుకే ఎలాంటి హడావుడి లేకుండా సభలను నిర్వహిస్తూ, కేవలం కుర్చీలు, మైక్, టెంట్, డయాస్ తో సరిపెట్టేస్తున్నారు అభ్యర్థులు.

More Telugu News