kodandaram: కేసీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించిన కోదండరామ్

  • ఏం చేశారని కేసీఆర్ కు మళ్లీ ఓటు వేయాలి
  • నాలుగున్నరేళ్లు నిరంకుశంగా పాలించారు
  • అజెండా నచ్చడం వల్లే మహాకూటమిలో చేరాం

ఏం చేశారని ఈ ఎన్నికల్లో కేసీఆర్ కు మళ్లీ ఓటు వేయాలని టీజేఎస్ అధినేత కోదండరామ్ ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో ప్రభుత్వ వ్యవస్థలన్నీ కుప్పకూలాయని విమర్శించారు. నాలుగున్నరేళ్ల పాటు రాష్ట్రాన్ని కేసీఆర్ నిరంకుశంగా పాలించారని మండిపడ్డారు. రాజకీయమంటే ప్రాజెక్టుల ద్వారా వచ్చిన కమిషన్లతో ఎమ్మెల్యేలను కొనడం కాదని అన్నారు. టీఆర్ఎస్ ది రాక్షసపాలన అయితే... మహాకూటమిది ప్రజల ఆంకాంక్షల పాలన అని చెప్పారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ, కోదండరామ్ ఈ మేరకు వ్యాఖ్యానించారు.

'ఐకాస'తో పోల్చితే టీజేఎస్ ను ఏర్పాటు చేయడం కష్టమనిపించలేదని... నాలుగున్నర నెలల్లోనే ప్రజల్లోకి పార్టీ వెళ్లిందని కోదండరామ్ అన్నారు. ఉద్యమ సమయంలో ఏర్పడిన పరిచయాలు పార్టీ ఏర్పాటుకు ఉపయోగపడ్డాయని చెప్పారు. గ్రామస్థాయిలో పార్టీకి మంచి పట్టు ఉందని తెలిపారు. 40 శాతం భూముల రికార్డుల ప్రక్షాళన జరగలేదని, రైతుబంధు పథకం కూడా గందరగోళంగా ఉందని విమర్శించారు. అజెండా నచ్చడం వల్లే ప్రజాకూటమిలో చేరామని...రోజురోజుకూ కూటమికి ప్రజల మద్దతు పెరుగుతోందని చెప్పారు. కూటమికి చెందిన ఒక అభ్యర్థి మాత్రమే బరిలో నిలిచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. స్నేహపూర్వక పోటీ లేకుండా ఉండేందుకు యత్నిస్తున్నామని చెప్పారు. 

More Telugu News