cbi: సీబీఐని నిరాకరించే అధికారం రాష్ట్రాలకు ఉంది.. కోర్టులు కూడా ఏమీ చేయలేవు: లాయర్ ఎర్నేని వేదవ్యాస్

  • ఢిల్లీ పోలీస్ యాక్ట్ సెక్షన్ 6 ప్రకారం సీబీఐని రాష్ట్రాలు నిరాకరించవచ్చు
  • ఒక భారత పౌరుడిగా నా వినతిపత్రాన్ని సీఎస్ కు ఇచ్చా
  • సీబీఐ ప్రతిష్ట పూర్తిగా దెబ్బతింది

సీబీఐ కంటే ఏపీ ఏసీబీకే మంచి పేరు ఉందని న్యాయవాది ఎర్నేని వేదవ్యాస్ అన్నారు. ఆదాయానికి మించిన కేసుల విచారణలో ఏసీబీ గొప్పగా పని చేస్తోందని... రాష్ట్ర ఏసీబీ పనితీరును ఐటీ, సీబీఐలు కూడా ప్రశంసించాయని అన్నారు. ఐటీ అధికారులు కూడా ఏసీబీ నుంచి వివరాలు తీసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిపై దర్యాప్తు చేసే సామర్థ్యం కూడా ఏసీబీకి ఉందని... సాంకేతిక నైపుణ్యాన్ని కూడా ఏసీబీ అందిపుచ్చుకుందని తెలిపారు.

సీబీఐని నిరాకరించే అధికారం రాష్ట్రాలకు ఉందని ఎర్నేని వేదవ్యాస్ అన్నారు. ఈ విషయంలో కోర్టులు కూడా ఏమీ చేయలేవని చెప్పారు. సీబీఐ ప్రతిష్ట దెబ్బతిందని... సీబీఐ కార్యాలయాల్లో సీబీఐ అధికారులే దాడులు చేస్తున్నారని ఆయన విమర్శించారు. సీబీఐ, ఐటీ, ఈడీలను రాజకీయ ప్రత్యర్థులపై ఉపయోగిస్తున్నారని చెప్పారు. ఢిల్లీ పోలీస్ యాక్ట్ సెక్షన్ 6 ప్రకారం సీబీఐని నిరాకరించే అధికారం రాష్ట్రాలకు ఉందని తెలిపారు. బాధ్యత కలిగిన ఒక భారత పౌరుడిగా, విజయవాడ న్యాయవాదిగా తన వినతిపత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇచ్చానని చెప్పారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా... న్యాయపరంగా ఎదుర్కోవడానికి తాను సిద్ధమేనని తెలిపారు. 

More Telugu News