Trupti Desai: అయ్యప్పను చూపించేంత వరకూ కేరళ వదలను, మహారాష్ట్ర పోను: తృప్తి దేశాయ్ ప్రతిజ్ఞ

  • స్వామిని దర్శించుకునే వెళ్తాను
  • నాపై దాడికి ప్రయత్నించారు
  • ఎయిర్ పోర్టు నుంచి వీడియో విడుదల

శబరిమలలోని అయ్యప్ప స్వామిని దర్శించుకునేంత వరకూ తాను కేరళను వదిలి మహారాష్ట్రకు పోబోనని భూమాతా బ్రిగేడ్ కార్యకర్త తృప్తి దేశాయ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో చిక్కుకున్న ఆమె, ఓ వీడియో సందేశాన్ని మీడియాకు పంపారు. తాను తెల్లవారుజామున ఇక్కడకు చేరుకున్నానని, బయట నిరసనకారులు ఎక్కువగా ఉండటంతో, పోలీసులు తమను నిలిపివేశారని తెలిపారు.

మరో గేటు గుండా బయటకు పంపేందుకు పోలీసులు ప్రయత్నించగా, తనపై కొందరు దాడికి ప్రయత్నించారని, దీంతో వెనక్కు వచ్చేశామని చెప్పారు. పోలీసులు తనకు భద్రత కల్పించాల్సిందేనని, వారు తోడు రాకున్నా, రేపు ఉదయం తాను శబరిమలకు బయలుదేరుతానని చెప్పారు.

నిరసనలు కాస్తంత తగ్గుముఖం పట్టిన తరువాత, తనను, తన బృందాన్ని బయటకు అనుమతిస్తామని పోలీసులు చెబుతున్నారని, ప్రస్తుతానికి వారి మాటలను విశ్వసిస్తున్నానని తృప్తి అన్నారు. ఏదేమైనా, అయ్యప్పను దర్శించుకోవాలన్న తన కోరికను తీర్చుకునే ఇక్కడి నుంచి వెళ్తానని తెలిపారు.

More Telugu News