Jagan: ఆయనేమైనా ప్రజల కోసం జైలుకెళ్లారా?.. అవినీతి చేసి వెళ్లారు: జగన్‌పై పవన్ సెటైర్లు

  • కత్తి గుచ్చుకుంది.. గాయమైందని హైదరాబాద్ వచ్చేశారు
  • తుపాను బాధితులను పట్టించుకోలేదు
  • ఆయన తండ్రినే ఎదిరించినోడిని

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోమారు మండిపడ్డారు. ఆయన జైలుకు వెళ్లింది అవినీతి కేసుల్లోనని, ప్రజల కోసం కాదని ఎద్దేవా చేశారు. జగన్‌లా తాను సంస్కారహీనంగా మాట్లాడలేనన్నారు. తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాలలో బుధవారం జరిగిన బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ.. జగన్‌పై విరుచుకుపడ్డారు.

జగన్ గొప్ప పనులు చేసి జైలుకు వెళ్లలేదని, అవినీతికి పాల్పడి వెళ్లారని గుర్తు చేశారు. ఆయన సురవరం ప్రతాపరెడ్డో, తరిమెల నాగిరెడ్డో, రావి నారాయణరెడ్డో, పుచ్చలపల్లి సుందరరామిరెడ్డో, పుచ్చలపల్లి రామచంద్రారెడ్డో కాదని పేర్కొన్నారు. వారంతా జైలుకెళ్లారని, జగన్ కూడా జైలుకు వెళ్లారని, అయితే వారికి, జగన్‌కు తేడా ఉందని అన్నారు. జైలుకెళ్లినంత మాత్రాన వారికీ, జగన్‌కు పోలిక లేదన్నారు. వారంతా జనం కోసం జైలుకెళ్లారని గుర్తు చేశారు.

హైదరాబాద్‌లోని భీంరావువాడలో పేదల ఇళ్లను జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తొలగించినప్పుడే తాను ఆయనను ఎదిరించానని పవన్ పేర్కొన్నారు. జగన్ తమ ఇంటి ఆడపడుచులను తిడుతున్నారని, ఆయనలా తాను సంస్కారహీనంగా మాట్లాడలేనన్నారు. తనకు భయం లేదన్నారు. తనకు అన్ని కులాలు సమానమేనని స్పష్టం చేశారు. తిత్లీ తుపానుతో శ్రీకాకుళం జిల్లా అతలాకుతలమైతే కత్తి గుచ్చుకుందని, గాయమైందని హైదరాబాద్‌కు వెళ్లిపోయారని జగన్‌ను ఎద్దేవా చేశారు.

More Telugu News