KCR: సొంత కారు లేదు.. అప్పులు రూ. 8.88 కోట్లు.. కేసులు 64: అఫిడవిట్ లో కేసీఆర్ వెల్లడి

  • గత ఎన్నికల సమయంలో రూ.15.15 కోట్ల ఆస్తులు ఉన్నట్టు వెల్లడి
  • ఈసారి ఆస్తుల విలువ రూ. 22.60 కోట్లు
  • కుమారుడు, కోడలికి బాకీ పడిన టీఆర్ఎస్ అధినేత

ఈసారి గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్న టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తనకున్న ఆస్తులు, అప్పులు, పోలీసు కేసుల గురించి రిటర్నింగ్ అధికారికి సమర్పించిన ప్రమాణపత్రంలో వివరించారు.  దాని ప్రకారం.. కేసీఆర్‌కు ఇప్పటికీ సొంత కారన్నది లేదు. మొత్తం ఆస్తుల విలువ రూ.22.60 కోట్లు. గత నాలుగేళ్లలో 17 ఎకరాల భూమిని అదనంగా కొనుగోలు చేశారు. భార్య శోభ పేరిట రూ. 93 వేల నగదు, 2.2 కిలోల బంగారు నగలు ఉన్నాయి. వీటి మొత్తం విలువ రూ. 94.59 లక్షలు. కేసీఆర్ అప్పులు గతంతో పోలిస్తే ఈసారి కోటి రూపాయలు పెరిగి రూ. 8.88 కోట్లకు చేరుకున్నాయి.

కొడుకు, కోడలుకి తాను బాకీ పడినట్టు ప్రమాణపత్రంలో కేసీఆర్ పేర్కొన్నారు. కుమారుడు కేటీఆర్‌కు రూ. 82 లక్షలు, కోడలు శైలిమకు రూ.24.65 లక్షలు బాకీ పడినట్టు తెలిపారు. అలాగే, ఇప్పటి వరకు తనపై 64 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ప్రమాణపత్రంలో పేర్కొన్నారు. ఇందులో రెండు కేసుల్లో సమన్లు అంది విచారణలో ఉన్నట్టు తెలిపారు. కాగా, గత ఎన్నికల్లో కేసీఆర్ తనకు రూ. 15.15 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు ఉన్నట్టు తెలిపారు. రూ.7.87 కోట్ల అప్పులు ఉన్నట్టు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అయ్యాక కేసీఆర్ అప్పులతోపాటు ఆస్తులు కూడా భారీగా పెరిగాయి.

More Telugu News