Chandrababu: చంద్రబాబుతో స్టాలిన్ అలా అన్నారట!: విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు

  • డీఎంకే నేత స్టాలిన్ ని చంద్రబాబు ఇటీవల కలిశారు
  • చంద్రబాబును స్టాలిన్ పిలవలేదట
  • బాబు పదిసార్లు ఫోన్ చేస్తే కాదనలేక రమ్మన్నారట

బీజేపీయేతర పక్షాలన్నింటిని ఒకే తాటిపైకి తెచ్చేందుకు దేశంలోని పలు పార్టీల నేతలను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఇప్పటికే కలిశారు. ఈ క్రమంలోనే డీఎంకే అధినేత స్టాలిన్ ని చంద్రబాబు ఇటీవల కలిసిన విషయం తెలిసిందే. ఈ భేటీపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. చంద్రబాబునాయుడు స్టాలిన్ ని కలిసి రావడం తమిళనాడులో తీవ్ర రాజకీయ దుమారం రేపుతోందని విమర్శించారు.

ఎర్రచందనం స్మగ్లర్ల పేరుతో తమిళనాడుకు చెందిన కూలీలను కాల్చి చంపిస్తున్నటువంటి చంద్రబాబును ఎందుకు రానిచ్చారని అన్నాడీఎంకే ఘాటుగా విమర్శలు చేసిందని ప్రస్తావించారు. చంద్రబాబును తానేమి పిలవలేదని, వస్తానంటూ పదిసార్లు ఫోన్లు చేయడంతో కాదనలేక ఒప్పుకున్నానని స్టాలిన్ వివరణ ఇచ్చారని, సొంత పార్టీలోనే అసమ్మతి ఎదుర్కొంటున్న స్టాలిన్ కు, బాబుతో భేటీ కొత్త చిక్కులు తెచ్చిపెట్టిందని అన్నారు.

తమిళనాడు రాష్ట్రాన్ని రెండు మూడు రోజుల్లో భారీ తుపాన్ కుదిపివేస్తుందన్న విషయాన్ని స్టాలిన్ ని కలిసినప్పుడు చంద్రబాబు చెప్పారట. దీంతో, ఆశ్చర్యపోయిన స్టాలిన్, ‘ఇంత ముందుగా మీకు ఎలా తెలుసు?’ అని అడిగితే, ‘కన్నుగీటాడట చంద్రబాబునాయుడు’. తిత్లీ తుపాన్ ఒడిశా వైపు వెళుతుందని ఐఎండీ సైంటిస్టులు చెబితే.. తన దివ్యదృష్టితో చూసి, అది కళింగపట్నం దగ్గరే తీరం దాటుతుందని చెప్పి, సైంటిస్టులను కడిగిపారేశానని స్టాలిన్ కు చంద్రబాబు చెప్పారట.

ఒక్కసారి షాక్ కు గురైనటువంటి స్టాలిన్.. ‘మీకు ఇన్ని విద్యలు తెలుసు కాబట్టే.. వేలసార్లు సిద్ధాంతాలు మార్చినా, వేల సార్లు యూటర్న్ లు తీసుకున్నా ఇంతగట్టిగా రాజకీయాల్లో నిలబడుతున్నారని సెటైర్లు విసిరారట. అది విని పొంగిపోయి, తర్వాత మీడియాతో మాట్లాడుతూ ‘దేశ ప్రధాని మోదీ గారి కన్నా స్టాలినే గొప్ప వ్యక్తి’ అని చంద్రబాబు కితాబిచ్చారు..’ అని విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

More Telugu News