kcr: మీకు దూరమయ్యానన్న బాధ నాలో ఉంది: కేసీఆర్

  • కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు నాకు ఉన్నాయి
  • తెలంగాణ ఉద్యమానికి కూడా ఇక్కడి నుంచే బయల్దేరాను
  • 100 సీట్లతో ఘన విజయాన్ని సొంతం చేసుకోబోతున్నాం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రచారరథంపై నుంచి ఆయన మాట్లాడుతూ, మీ అందరి దీవెనలతో యుద్ధానికి బయల్దేరుతున్నానని చెప్పారు. స్వామివారి ఆశీస్సులతో ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించానని, స్వామి ఆశీస్సులు తనకు ఉన్నాయని తెలిపారు. ఇక్కడ పూజలు చేసే తెలంగాణ ఉద్యమానికి బయల్దేరానని చెప్పారు. ప్రతి రాజకీయ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించానని తెలిపారు. రైతులకు అప్పులులేని తెలంగాణే బంగారు తెలంగాణ అని అన్నారు. వచ్చే ఏడాది కాళేశ్వరం నీటితో దేవుడి పాదాలను కడుగుదామని చెప్పారు. దేశంలో 24 గంటలు విద్యుత్ ఇచ్చే రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు.

స్వామి ఆశీస్సులతో అన్నింటిలోనూ విజయం సాధించానని... రానున్న ఎన్నికల్లో 100 సీట్లతో ఘన విజయాన్ని సొంతం చేసుకోబోతున్నామని కేసీఆర్ తెలిపారు. ఎవరూ నమ్మని రీతిలో సమస్యలను పరిష్కరించుకున్నామని చెప్పారు. రాష్ట్రాన్ని చక్కదిద్దే క్రమంలో ప్రజలకు దూరమయ్యానన్న బాధ తనలో ఉందని అన్నారు. దేశంలోనే ధనిక రైతులకు తెలంగాణ వేదికగా మారాలని ఆకాంక్షించారు. సిద్ధిపేటలో హరీష్ రావును ఆశీర్వదించాలని ఓటర్లను కోరారు. అనంతరం నామినేషన్ వేయడానికి ఆయన కోనాయిపల్లి నుంచి బయల్దేరారు.

More Telugu News