minister harishrao: లోకానికి చీకటి ఎలాంటిదో మన దేహానికి అహం కూడా అలాంటిదే: మంత్రి హరీశ్ రావు

  • తొలి కార్తీక సోమవారం చాలా విశిష్టమైంది
  • హిందువులందరికీ అత్యంత శుభప్రదమైన రోజు ఇది
  • ఎన్టీవీ చౌదరి ఆధ్యాత్మిక ఉద్యమకారుడు

లోకానికి చీకటి ఎలాంటిదో, మన దేహానికి అహం కూడా అలాంటిదేనని తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో భక్తి టీవీ ఛానెల్ నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ, తొలి కార్తీక సోమవారం చాలా విశిష్టమైన రోజని, ఈరోజు హిందువులందరికీ అత్యంత శుభప్రదమైందని అన్నారు. ప్రతి ఏడాదీ నిర్వహించే కోటి దీపోత్సవ కార్యక్రమంలో తాను పాల్గొంటున్నానని, ఇది ఎనిమిదో సంవత్సరమని చెప్పారు. హిందూ సంప్రదాయాన్ని పరిరక్షిస్తూ, ఎంతో పవిత్ర ఉద్యమం లాగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని నిర్వాహకులను ఆయన అభినందించారు.

ఉద్యమ నేపథ్యం నుంచి తాను వచ్చానని, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఎన్టీవీ చౌదరిని చూస్తుంటే ఆయన ఆధ్యాత్మిక ఉద్యమకారుడిగా మారినట్టు అనిపిస్తోందని ప్రశంసించారు. అటు ప్రభుత్వం సాయం గానీ, ఇతరుల నుంచి కానీ ఎటువంటి సహకారం తీసుకోకుండా ఆయన, ఆయన కుటుంబసభ్యులు, వారి సిబ్బంది ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, ఆయనపై భగవంతుడి కృప ఉందని అన్నారు.

 భక్తితో మనమందరమూ దీపాన్ని వెలిగిస్తే, అజ్ఞానపు చీకట్లన్నీ కూడా తొలగిపోతాయని అన్నారు. ఈ దీప కాంతులతో లోకానికి వెలుగును ప్రసాదిస్తూ, ఆ జ్ఞాన జ్యోతి వెలుగుల్లో మనలో ఉండే అహాన్ని ఆహుతి చేసుకుందామని, మనిషికి ఏదైనా శత్రువు ఉందంటే అది మనలోని అహమేనని చెప్పుకొచ్చారు. ఈ కార్తీక దీపోత్సవం అందరికీ సుఖశాంతులను, మంచి భవిష్యత్తును ఆ పరమ శివుడు ప్రసాదించాలని కోరుకుంటున్నానని అన్నారు.

More Telugu News