Team India: ధవన్ దూకుడు.. ఉత్కంఠ పోరులో భారత్‌దే విజయం!

  • మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ క్లీన్ స్వీప్
  • చివరి బంతికి సింగిల్ తీసి విజయాన్ని అందించిన పాండే
  • మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ధవన్

విండీస్‌తో జరిగిన చివరిదైన మూడో టీ20లో భారత విజయం సాధించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగింది. చివరి బంతికి పాండే సింగిల్ తీసి భారత్‌కు విజయాన్ని అందించాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 181 పరుగుల భారీ స్కోరు సాధించింది. షాయ్ హోప్ 24, షిమ్రన్ హెట్‌మయెర్ 26, డారెన్ బ్రావో 43 పరుగులు చేయగా, చివర్లో నికోలస్ పూరన్ చెలరేగిపోయాడు. 25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 53 పరుగులు చేశాడు.

అనంతరం 182 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. కీమోపాల్ వేసిన మూడో ఓవర్ రెండో బంతికి టీమిండియా సారథి రోహిత్ శర్మ (4) బ్రాత్‌వైట్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 45 పరుగుల వద్ద కేఎల్ రాహుల్(17) కూడా అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్‌తో కలిసి ఓపెనర్ శిఖర్ ధవన్ విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలో ఇద్దరూ అర్ధ సెంచరీలు సాధించారు. దొరికిన బంతిని దొరికినట్టు బౌండరీలకు పంపిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.

19వ ఓవర్‌లో కీమోపాల్ వేసిన రెండో బంతికి అనవసర షాట్ కోసం ప్రయత్నించిన పంత్ (58) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత చివరి రెండు బంతుల్లో విజయానికి ఒక్క పరుగు కావాల్సి ఉండగా ధవన్ (92) భారీ షాట్‌కు ప్రయత్నించి పొలార్డ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. అయితే, చివరి బంతికి పాండే సింగిల్ తీయడంతో భారత్ విజయం సాధించింది. ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్ సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది.  92 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన శిఖర్ ధవన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

More Telugu News