Andhra Pradesh: మూడు నెలల మంత్రి పదవితో ముస్లింలకు ఒరిగేది ఏంటి?: ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ వైసీపీ నేత ఇక్బాల్!

  • ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది
  • ఈ 3 నెలల్లో ముస్లింలకు ఏం చేస్తారు?
  • ఇతర నేతలు ప్రశ్నిస్తారనే పదవుల పంపకం

నాలుగున్నరేళ్లుగా ముస్లింలను పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు ఫరూక్ ను మంత్రిగా నియమించి నాటకాలు ఆడుతున్నారని వైసీపీ నేత మొహమ్మద్ ఇక్బాల్ విమర్శించారు. కేవలం 3 నెలల కాలానికి మైనారిటీలను మంత్రులుగా నియమించడం పుండు మీద కారం చల్లటమేనని ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఈ నియామకాలతో మైనారిటీలకు ఏం ప్రయోజనం చేకూరుతుందని ప్రశ్నించారు. హజ్ కమిటీ, ఉర్దూ అకాడమీలకు చైర్మన్లుగా నియమించి ఏదో అద్భుతం చేసినట్లు టీడీపీ నేతలు పోజు కొడుతున్నారని దుయ్యబట్టారు.

చివరికి క్షణంలో ఈ నియామకాలతో ముస్లింలకు ఎలాంటి ప్రయోజనం చేకూరదని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతానని చంద్రబాబు దేశం పట్టుకుని తిరుగుతున్నారని ఇక్బాల్ ఎద్దేవా చేశారు. ఇలాంటి సందర్భాల్లో ‘అసలు మీ మంత్రివర్గంలో మైనారిటీ, గిరిజనులకు చోటుందా?’ అన్న ప్రశ్నలు ఎదురవుతాయన్న భయంతోనే చంద్రబాబు తాజా నియామకాలు చేపట్టారని వ్యాఖ్యానించారు. ముస్లింలపై అంత ప్రేమ ఉంటే అధికారంలోకి వచ్చిన 2014లోనే మైనారిటీ మంత్రిని నియమించి ఉండేవారని స్పష్టం చేశారు.

More Telugu News