gali janaerdhan reddy: ఇబ్బందుల్లో గాలి జనార్దన్ రెడ్డి.. ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు!

  • ఈడీ కేసులో సెటిల్మెంట్ కు యత్నం
  • లుక్ అవుట్ నోటీసులు జారీచేసిన పోలీసులు
  • ప్రస్తుతం పరారీలో ఉన్న బీజేపీ నేత

కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ నేత గాలి జనార్దన్ రెడ్డి ఓ ఈడీ కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. అంబిడెంట్ అనే కంపెనీని కాపాడటానికి గాలి 57 కేజీల బంగారం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా మరో ఈడీ అధికారికి రూ.కోటి లంచం ముట్టజెప్పినట్లు ఆయనపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గాలి జనార్దన్ రెడ్డిని విచారించేందుకు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు యత్నిస్తున్నారు. కాగా, ఈ కేసులోఅరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు గాలి ముందస్తు బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

బెంగళూరులో సెషన్స్ కోర్టులో ఈ రోజు గాలి జనార్దన్ రెడ్డి తరఫు న్యాయవాదులు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు రాజకీయ దురుద్దేశంతోనే ఆయనపై కేసు దాఖలు చేశారనీ, ఇందులో తమ క్లయింట్ కు ఎలాంటి సంబంధం లేదని కోర్టుకు విన్నవించారు. అయితే ఈ బెయిల్ పిటిషన్ పై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

మరోవైపు గాలి జనార్దన్ రెడ్డి కోసం నాలుగు బృందాలు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గాలిస్తున్నాయి. రూ.600 కోట్ల కుంభకోణం కేసులో చిక్కుకున్న అంబిడెంట్ కంపెనీని ఈడీ విచారణ నుంచి కాపాడటం కోసం సెటిల్మెంట్ కు ప్రయత్నించి గాలి ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. ఆయన దేశం దాటిపోకుండా ఇప్పటికే అధికారులు లుక్ అవుట్ నోటీసులు జారీచేశారు.

More Telugu News