అచ్చం ‘అతడు’ సినిమాలాగే.. 15 ఏళ్లుగా టెక్కీని వెంటాడి పట్టుకున్న పోలీసులు!

09-11-2018 Fri 13:53
  • కర్ణాటక రాజధాని బెంగళూరులో ఘటన
  • పేరు మార్చుకుని మేనేజర్ గా ప్రమోషన్
  • ఒక్క ఫోన్ కాల్ తో పట్టుకున్న అధికారులు
సినిమాకు ఏమాత్రం తక్కువ కాకుండా ట్విస్టులు ఉన్న కేసు ఇది. భార్యను హత్యచేసి పారిపోయిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను పోలీసులు 15 సంవత్సరాల పాటు వెంటాడారు. ఊరు, పేరు మార్చుకుని రహస్యంగా ఉంటున్న అతడిని ఓ ఫోన్ కాల్ తో పట్టుకున్నారు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది.

కేరళకు చెందిన తరుణ్ జిన్‌రాజ్‌ (45) దాదాపు 22 ఏళ్ల క్రితం అహ్మదాబాద్ కు కుటుంబంతో వలసవెళ్లాడు. అక్కడే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూ సజని అనే యువతిని 2001లో వివాహం చేసుకున్నాడు. అయితే భార్యకు మరొకరితో అక్రమ సంబంధం ఉందని అనుమానించిన జిన్ రాజ్.. మరికొందరితో కలిసి ఆమెను హత్య చేశాడు. అనంతరం ఎవరో దోపిడీ దొంగలు తన భార్యను చంపేసి నగలను దోచుకెళ్లాడని కట్టుకథలు అల్లాడు. చివరికి విచారణ కొనసాగుతుండగానే ఓ రోజు మాయమయ్యాడు.

దీంతో కేసు విచారణను ఉద్ధృతం చేసిన అధికారులు ఈ హత్యతో సంబంధమున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా, తరుణ్ భార్యను చంపినట్లు తేలింది. అతని కోసం అధికారులు గాలింపు ప్రారంభించారు. అయితే అహ్మదాబాద్ నుంచి వచ్చేసిన తరుణ్.. తనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో నకిలీ గుర్తింపు పత్రాలు సృష్టించాడు. ఎక్కడా తనకు సంబంధించి ఒక్క ఫొటో కూడా లేకుండా జాగ్రత్త పడ్డాడు.

ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ప్రవీణ్ బాటలే అనే మారు పేరుతో చేరి ఏకంగా మేనేజర్ స్థాయికి ఎదిగాడు. ఈ క్రమంలో తరుణ్ తల్లికి ఫోన్ చేసి మాట్లాడేవాడు. దీన్ని గుర్తించిన అధికారులు ఫోన్ నంబర్ ను ట్రేస్ చేశారు. చివరికి బెంగళూరులో నిందితుడు ఉన్నట్లు గుర్తించిన అధికారులు మఫ్టీలో అతని దగ్గరకు వెళ్లారు. ‘అతడు’ సినిమా తరహాలో పోలీసులు తరుణ్ జిన్ రాజ్? అంటూ పిలిచారు.

దీంతో నిందితుడు అనాలోచితంగా ‘ఆ.. తరుణ్ అంటే నేనే. మీకేం కావాలి?’ అంటూ అడ్డంగా దొరికిపోయాడు. దీంతో తరుణ్ ను అక్కడే అదుపులోకి తీసుకున్న పోలీసులు గుజరాత్ కు తరలించారు. నిందితుడు నేరాన్ని అంగీకరించడంతో కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కు తరలించారు.