Chandrababu: దేవేగౌడ ఆశీస్సుల కోసమే బెంగళూరుకు వచ్చా: చంద్రబాబు

  • దేశాన్ని కాపాడటానికి విపక్ష నేతలంతా ఏకం కావాల్సిన సమయం వచ్చింది
  • సీబీఐ, ఆర్బీఐలను కేంద్ర ప్రభుత్వం నాశనం చేసింది
  • విపక్ష నేతలను ఇబ్బంది పెట్టేందుకు ఈడీ, ఐటీ వ్యవస్థలను వాడుకుంటోంది

ఎన్డీయేకు వ్యతిరేకంగా మహాకూటమిని ఏర్పాటు చేసే క్రమంలో మాజీ ప్రధాని దేవేగౌడ ఆశీస్సులు తీసుకోవడానికి, ఆయన మద్దతు కోరడానికే తాను బెంగళూరుకు వచ్చానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గతంలో మన దేశాన్ని పాలించిన యునైటెడ్ ఫ్రంట్ కు దేవేగౌడ ఛైర్మన్ గా, తాను కన్వీనర్ గా వ్యవహరించిన సంగతి అందరికీ తెలిసిందేనని చెప్పారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి దేవేగౌడతో పాటు తనలాంటి నేతలంతా ఏకం కావాల్సిన అవసరం వచ్చిందని తెలిపారు. బెంగళూరులో దేవేగౌడ, కుమారస్వామిలతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

సీబీఐ, ఆర్బీఐలాంటి స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థలను కూడా ఎన్డీయే ప్రభుత్వం నాశనం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ ఇష్టాలకు అనుగుణంగా వ్యవస్థను తాము నడపలేమంటూ సాక్షాత్తు ఆర్బీఐ గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారంటే... పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. విపక్షాలను కంట్రోల్ చేయడానికి ఈడీ, ఐటీ వ్యవస్థలను వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లో విపక్ష పార్టీల నేతలను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. 

More Telugu News