Andhra Pradesh: 14 కంటే ఎక్కువ సీట్లు మనకొద్దు.. కూటమి విజయంపై దృష్టి పెట్టండి!: టీటీడీపీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం

  • అమరావతితో బాబుతో రమణ భేటీ
  • 1-2 రోజుల్లో అభ్యర్థుల జాబితాపై స్పష్టత
  • ప్రజాకూటమిని ఇబ్బందిపెట్టొద్దని సూచన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఈ రోజు టీటీడీపీ నేతల సమావేశం ముగిసింది. టీటీడీపీ చీఫ్ ఎల్.రమణ నేతృత్వంలో ఈ రోజు బాబును కలుసుకున్న నేతలు తెలంగాణలో పోటీ చేయనున్న సీట్లు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అమరావతిలో ఈ రోజు బాబుతో సమావేశమైన అనంతరం రమణ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీకి వ్యతిరేకంగా దేశమంతా ప్రతిపక్షాలను ఏకం చేస్తామని తెలిపారు. ఇందులో భాగంగా ఈ రోజు చంద్రబాబుతో కలిసి బెంగళూరుకు వెళతామన్నారు.

రాబోయే ఎన్నికల్లో టీడీపీ రెండు అంకెల సీట్లను గెలుచుకుంటుందని రమణ ధీమా వ్యక్తం చేశారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పోటీ చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ ఎన్నికల్లో ప్రజాకూటమి అభ్యర్థుల విజయమే ముఖ్యమనీ, సీట్ల సంఖ్యను పట్టించుకోవద్దని చంద్రబాబు స్పష్టం చేసినట్లు సమాచారం.

కాగా, మరో 1-2 రోజుల్లో తుది జాబితా, అభ్యర్థుల పేర్లపై స్పష్టత వచ్చే అవకాశముందన్నారు. ప్రజాకూటమిలో 14 కంటే ఎక్కువ సీట్లను కోరితే ఇబ్బందికర పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. టీడీపీ అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో పోటీ చేయడం ముఖ్యం కాదనీ, కూటమి అధికారంలోకి వచ్చే విషయమై ప్రాధాన్యత ఇవ్వాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.

More Telugu News