Chandrababu: చంద్రబాబు రహస్య సర్వే... కనీసం ఏడుగురి సీట్లు గల్లంతే!

  • ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయించిన చంద్రబాబు
  • పలువురిపై వ్యతిరేకత ఉన్నట్టు వెల్లడి
  • అభ్యర్థులను మార్చేస్తానని చంద్రబాబు సంకేతాలు

మరో ఐదారు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో ఏపీ చంద్రబాబు నాయుడు చేయించిన ఓ రహస్య సర్వే, ఇప్పుడు టీడీపీ, వైసీపీలో గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో తీవ్ర కలకలాన్ని రేపుతోంది. వచ్చే రెండు నెలల కాలాన్నీ అత్యంత కీలకంగా భావిస్తున్న చంద్రబాబు, తాను చేయించిన సర్వేలో ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని తేలడంతో ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది. ముఖ్యంగా పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, గుంటూరు తదితర జిల్లాల్లోని ఆరేడుగురు ఎమ్మెల్యేలు మరోసారి గెలిచే పరిస్థితి లేదని ఈ సర్వే తేల్చినట్టుగా సమాచారం.

చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తిని వ్యక్తం చేసిన ప్రజలు, సీఎంగా చంద్రబాబుపై మాత్రం తమకు నమ్మకం ఉందని చెప్పడంతో, ఆయా నియోజకవర్గాలపై చంద్రబాబు ప్రత్యేక దృష్టిని సారించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికీ కొందరు ఎమ్మెల్యేలు పట్టీ పట్టనట్టు వ్యవహరిస్తుండటంతో, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న చంద్రబాబు, వారికి టికెట్లు ఇచ్చేది లేదన్న సంకేతాలు పంపినట్టు తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా ఆయా నియోజకవర్గాల్లో మార్పు, చేర్పులు అనివార్యమని సమాచారం.

ఇక ఇంటింటికీ వంట గ్యాస్ పైప్ లైన్లు, రేషన్ కార్డులు, సొంత ఇళ్లు, రహదారుల మెరుగు వంటి అంశాలపై సమస్యలు ఎక్కడ ఉన్నా, వాటిని జనవరిలోగా పరిష్కరించాలని చంద్రబాబు నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి. సాధ్యమైనంత వరకూ సమస్యలను పరిష్కరించడం ద్వారా ఎమ్మెల్యేలపై ప్రజామోదాన్ని పెంచాలని, వారి పనితీరు మారకుంటే అభ్యర్థుల మార్పు తప్పదని అధినేత నుంచి స్పష్టమైన సంకేతాలు అందడంతో వీరిలో ఆందోళన నెలకొంది.

More Telugu News