Telangana: తెలంగాణలో పట్టుబడ్డ హవాలా ముఠా.. భారీగా నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు!

  • హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఘటన
  • రూ.7.7 కోట్ల నగదు స్వాధీనం
  • రాజకీయ నేత ఇంటి సమీపంలోనే దాడి

తెలంగాణలో త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ పోలీసులు ఓ హవాలా రాకెట్ ముఠాను పట్టుకున్నారు. ఢిల్లీ, మహారాష్ట్ర నుంచి భారీగా నగదును తీసుకొస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుల నుంచి రూ.7.7 కోట్ల క్యాష్ ను స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్ లోని రోడ్డు నంబర్ 12లో ఓ ఇంటిలో నగదు ఉన్నట్లు పక్కా సమాచారం అందుకున్న అధికారులు ఈ రోజు ఉదయం దాడి చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనకు సంబంధించి నలుగురు నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. త్వరలోనే వీరిని కోర్టులో హాజరు పరుస్తామని వెల్లడించారు. ఈ నగదును ఎవరికోసం తీసుకొచ్చారు? ఎవరు పంపారు? అసలు ఈ నగదు బట్వాడా వెనుక ఎవరు ఉన్నారు? అనే కోణంలో విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు.

వీరిని కస్టడీకి ఇవ్వాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరతామని తెలిపారు. కాగా, ఓ రాజకీయ నేత ఇంటి సమీపంలోనే ఈ మొత్తం నగదు దొరకడంతో ఆ కోణంలోనూ దర్యాప్తును కొనసాగిస్తున్నామని వెల్లడించారు.

More Telugu News